ఏపీలో జగన్ పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. ఎన్నికలు ఎపుడు వచ్చినా చంద్రబాబే సీఎం అని జోస్యం చెబుతున్నారు. తెలుగుదేశం విడుదల చేసిన మినీ మ్యానిఫేస్టోను చూస్తే వైసీపీకి గుండెల్లో గుబులు పుట్టిందని అంటున్నారు.
తెలుగుదేశం బస్సు యాత్రకు జనాలు బ్రహ్మరధం పడుతున్నారని అంటున్నారు. గంటా వంటి అనుభవశాలి, విశాఖ ఆక్టోపస్ గా పేరు గాంచిన నాయకుడు చెప్పేది బాబే ఏపీ సీఎం అని. ఇంత ధాటీగా గంటా మాస్టారు చెప్పిన తరువాత అయినా టీడీపీ ఒంటరు పోరుకు తెగిస్తుందా అన్నదే వైసీపీ నుంచి వస్తున్న సూటి ప్రశ్న.
పొత్తులతోనే రావాలని ఈ రోజుకీ టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులతో 2014 నాటి కాంబినేషన్ తీసుకుని వస్తారని ప్రచారంలో ఉన్న మాట. గంటాకు మాత్రం ఏపీలో ఎపుడు ఎన్నికలు పెట్టినా టీడీపీయే గెలుస్తుంది అని ధీమా కనిపిస్తోంది.
ఆయనతో పాటు మరో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇదే మాట చెబుతున్నారు. ఆరు నెలలు ఓపిక పడితే నేనే కొత్త హోం మంత్రిని అని అంటున్నారు. ఇంతలా టీడీపీ దిగ్గజాలు జనం నాడి తెలుసుకుని టీడీపీ విజయాలను కళ్ళలో చూస్తూంటే చంద్రబాబు మాత్రం పొత్తుల కోసం చూస్తున్నారెందుకు అని వైసీపీ నుంచి సెటైర్లు పడుతున్నాయి.
జగన్ మీద జనాలు విసిగిపోతే తమనే ఎన్నుకుంటారు అని టీడీపీ వారు అంటున్నారు. విసిగిపోయారని అంటున్నారు. ఈ నమ్మకం అయితే టీడీపీ అధినేతలో లేదు కాబట్టే పొత్తుల ఎత్తులతో బిజీగా ఉన్నారని అక్కడే జగన్ బలమేంటో తెలుస్తోంది అని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో మీ భవిష్యత్తుకు మా గ్యారంటీ బస్సు యాత్రలో గంటా యమ జోష్ తో మాట్లాడుతూ వచ్చేది టీడీపీయే అని ప్రకటించారు.