అత్యంత అవినీతిపరులని బదిలీ వేటుకు గురైన ఇద్దరు తహశీల్దార్లను పట్టు పట్టి మరీ తిరిగి వేయించుకున్నారు. ఈ ఘనత తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి దక్కింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట, ఏర్పేడు తహశీల్దార్లు ఎస్.శివప్రసాద్, ఆర్వీ ఉదయ్సంతోష్లపై కొన్ని నెలలుగా తీవ్రమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి.
నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రత్యేకంగా రేణిగుంట తహశీల్దార్ ఎస్.శివప్రసాద్ అవినీతి గురించి ఘాటైన విమర్శలు చేశారు. వీళ్లిద్దరి అవినీతిపై జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారీగా ఫిర్యాదులు వెళ్లాయి. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన ఉన్నతాధికారి సమీప బంధువు పొలం సమస్య విషయమై రేణిగుంట తహశీల్దార్‌కు వెళితే, చివరికి అతని నుంచి కూడా భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ప్రభుత్వ భూముల్ని అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడంలోనూ, ప్రైవేట్ ఆస్తుల్ని వివాదంలో పడేసి, అధికార పార్టీ ముఖ్య నేతలతో కుమ్మక్కై సెటిల్మెంట్ చేసుకుంటూ ఆస్తుల్ని పెంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏర్పేడు, రేణిగుంట తహశీల్దార్లను ఈ నెల 15న కలెక్టరేట్‌కు సరెండర్ చేశారు. వీళ్లిద్దరి అవినీతిపై చీఫ్ సెక్రటరీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది.
రేణిగుంట తహశీల్దార్‌గా తిరుపతి కలెక్టరేట్లో డి సెక్షన్లో పని చేస్తున్న మహిళా అధికారి ఎం.భార్గవిని యుద్ధప్రాతిపదికన రేణిగుంటకు , అలాగే ఎస్.ద్వారకనాథరెడ్డిని ఏర్పేడుకు బదిలీ చేశారు. అయితే తాను చెప్పిన పనిని కళ్లు మూసుకుని చేసే రెవెన్యూ అధికారులను బదిలీ చేయడంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. యథాస్థానాలకు తిరిగి వారిని తెచ్చుకోడానికి 10 రోజులుగా ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
చివరికి యథాస్థానాలకు కాకుండా, కొంచెం అటుఇటుగా మార్చి వారిని బదిలీ చేయడం గమనార్హం. ఎస్.శివప్రసాద్‌ను ఏర్పేడుకు, ఆర్వీ ఉదయ్ సంతోష్‌ను రేణిగుంటకు రాత్రికి రాత్రే బదిలీ ఉత్తర్వులను ప్రభుత్వం ఇవ్వడం చర్చనీయాంశమైంది. పైగా బదిలీల గడువు ముగిసిన తర్వాత కూడా ప్రక్రియ కొనసాగించడంపై రెవెన్యూ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇదిలా వుండగా తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోఫణలతో బదిలీ అయిన అధికారుల్ని, ఎమ్మెల్యే ఒత్తిడి, సిఫార్పుతో మళ్లీ రెవెన్యూ అధికారులుగా బదిలీ చేయడం జనాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రేణిగుంట తహశీల్దార్‌గా కనీసం రెండు వారాల కాలాన్ని కూడా సరిగ్గా పూర్తి చేసుకోకుండానే భార్గవిని తిరిగి కలెక్టరేట్లోని డీ సెక్షన్‌కు బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఒక మహిళా అధికారిని తమ రాజకీయ క్రీడలో పావుగా వాడుకోవడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. అవినీతిపరులైన అధికారుల్ని వైసీపీ ప్రభుత్వం రెండువారాల్లో నీతివంతులుగా మార్చి తహశీల్దార్లుగా పోస్టింగ్‌లు ఇచ్చిందనే సెటైర్స్ ప్రత్యక్షమయ్యాయి.