గంటాను అక్కడ నుంచి పోటీ చేయమంటున్నారు

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు విశాఖ అక్టోపస్ గా మారిపోయారు. ఉత్తరాంధ్రా  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడం ఖాయమని…

మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు విశాఖ అక్టోపస్ గా మారిపోయారు. ఉత్తరాంధ్రా  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం గెలవడం ఖాయమని ప్రకటనలు చేస్తున్నారు. పనిగట్టుకుని గుంటూరు వెళ్ళి మరో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణతో కలసి మీడియాతో మాట్లాడారు.

విశాఖ రాజధాని అన్న వైవీ సుబ్బారెడ్డి ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. విశాఖ రాజధాని నినాదం పూర్తిగా కొట్టుకుపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ గెలవడమే దానికి సాక్ష్యమని గొప్పగా చెప్పారు. అంతే కాదు ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ కనుక మధ్యలో లేకపోతే మొత్తం ఓట్లలో టీడీపీకి డెబ్బై శాతం ఓట్లు వచ్చేవని, వైసీపీకి కేవలం ఇరవై తొమ్మిది శాతమే వచ్చాయని లెక్కలు చెప్పారు.

ఈ లెక్కల మీద విశ్లేషణల మీద వైసీపీ నేతలు కస్సుమంటున్నారు గంటా ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కలు ఎందుకు చెబుతారని అంటున్నారు. ఆయన వైసీపీ గ్రాఫ్ పడిపోయిందని అంటున్నారని, నిజానికి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో గంటా గ్రాఫ్ చూసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ నుంచి 2024లో గంటా పోటీ చేయగలరా అని సవాల్ చేస్తున్నారు.

తనను గెలిపించిన నియోజకవర్గం ప్రజలను గాలికి వదిలేసిన గంటా కొత్త సీట్లో పోటీకి ప్రయత్నాలు చేసుకుంటున్నారు తప్ప ఉత్తరం ఊసు ఎత్తడం లేదని ఎద్దేవా చేశారు. విశాఖ ఉత్తరంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఇంచార్జి కేకే రాజు ఈ రోజుకీ తానే అన్నీ అయి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

ఈ మధ్య వచ్చిన పలు సర్వేలలో కూడా కేకే రాజు గెలుస్తారని వచ్చిందని, గంటా ఉత్తరం నుంచి గెలిచి చూపించాలని అంటున్నారు. మరికొందరు వైసీపీ నేతలు అయితే గతంలో ఇదే గంటా విశాఖ రాజధానికి మద్దతుగా మాట్లాడిన సంగతిని గుర్తు చేస్తున్నారు.