‘బలగం’ దెబ్బకి చిన్న సినిమాల వెల్లువ

చిన్న సినిమా అనేది చచ్చిపోయింది..చిన్న సినిమాలు తీయడం దండగ..చిన్న సినిమాల్ని జనం చూడడం లేదు..చిన్న సినిమాలని ఓటీటీలు చిన్న చూపు చూస్తున్నాయి… Advertisement ఫిల్మ్ నగర్ లో ఏ ఆఫీసుకెళ్లినా ఈ వాక్యాలు వినిపిస్తూనే…

చిన్న సినిమా అనేది చచ్చిపోయింది..చిన్న సినిమాలు తీయడం దండగ..చిన్న సినిమాల్ని జనం చూడడం లేదు..చిన్న సినిమాలని ఓటీటీలు చిన్న చూపు చూస్తున్నాయి…

ఫిల్మ్ నగర్ లో ఏ ఆఫీసుకెళ్లినా ఈ వాక్యాలు వినిపిస్తూనే ఉంటాయి. నిజంగానే ప్రేక్షకులు థియేటర్లకొచ్చి సినిమా చూడాలంటే భారీ తారాగణం, భారీతనం ఉండాలన్నట్టుగానే ఉంది. కొత్త నటీనటులతో తీసిన సినిమాలు ఊరూపేరు లేకుండా పోతున్నాయి. ఒకవేళ తీసినా మాండలికం బ్యాక్డ్రాపుతో ఫన్నీ ఫన్నీ గా ఉంటూ యూత్ కి నచ్చే విధంగా ఉండాలన్నది ఒక అభిప్రాయం. దీనికి కారణం జాతిరత్నాలు, డిజె టిల్లు లాంటి సినిమాలు. 

1980ల్లోనూ, 90ల్లోనూ గ్రామీణ నేపథ్యంలో సినిమాలొచ్చేవి. ఆర్ట్ సినిమాలు అంటూ కొట్టి పారేసినా వాటికంటూ ఒక ఆదరణ ఉండేది. పెద్దగా డబ్బులు దండుకోకపోయినా అవార్డుల్లాంటివి వచ్చేవి. “భద్రం కొడుకో”, “ఎర్ర మల్లెలు”, ఆర్ నారాయణమూర్తి చిత్రాలు…ఆ రకమన్నమాట. 

ఇప్పుడలాంటి సినిమాలు తీసే ఆలోచనే డబ్బులు పోగొట్టుకునే ఆలోచన తప్ప మరొకటి కాదు అన్నట్టుగా ఉంది. పాత రోజుల్లోలాగ కంటెంట్ చూసి అవార్డులిచ్చే ప్రభుత్వాలు, సంస్థలు ఇప్పుడు లేవు. అవార్డులన్నీ పాపులర్ సినిమాలకే. డబ్బూ పోయి, పేరూ రాక దేనికి ఆయాసపడడం! కనుక ఆ రకం సినిమాలు తీసే ఆలోచన దాదాపు సమాజం విరమించుకున్న తరుణంలో  “బలగం” వచ్చింది. 

ఒక ప్రియదర్శి, వేణు, శరణ్య తప్ప మిగిలిన నటీనటులంతా చాలామందికి కొత్తే. సినిమా ఒక చావు చుట్టూ తిరిగే గ్రామీణ కథాంశం. ఒకప్పటి ఆర్ట్ సినిమా లక్షణాలు సంపూర్ణంగా ఉన్న సినిమా. అయినా తీసారు. ఊహించని విధంగా హాల్లో ఆడేసింది. తొలుత కలెక్షన్స్ మందకొడిగా ఉన్నా క్రమంగా మౌత్ టాక్ వల్ల అద్భుతమైన హిట్ అనిపించుకుంది. ఒక అంచనా ప్రకారం సుమారు రెండున్నర కోట్లకి అటు ఇటుగా తీసిన ఈ సినిమా థియేటర్ల నుంచే దాదాపు 10-15 కోట్ల వరకు వసూలు చేసిందని వినికిడి. అది సామాన్యమైన విజయం కాదు. ఇప్పుడు ప్రైం వీడియోలో రాగానే చాలామంది రోజుకొక పోస్ట్ పెడుతున్నారు ఫేస్బుక్కులో అద్భుతమంటూ. ఆ రకంగా డబ్బుకి డబ్బు, పేరుకి పేరు సంపాదించుకున్న చిత్రమిది. అవార్డుల వెల్లువ కూడా మొదలయ్యింది. 

ఒక “బాహుబలి” హిట్టైతే తెలుగు సినిమాకి అంత పెట్టుబడి పెట్టొచ్చనే అంచనాలు పెద్ద నిర్మాతలకి ఎలా ఏర్పడ్డాయో, ఒక “బలగం” చూసి చిన్న నిర్మాతలు ఇలా కూడా తీయొచ్చనే అంచనాలకి రావడం సహజం. 

నిర్మాతలంటే సమాజంలోనే ఉంటారు. వారి మనసులో ఆర్ద్రత ఉంటుంది, మంచి కథ విన్నప్పుడు సినిమా తియ్యాలని ఉంటుంది. కానీ జనం పట్టించుకోరన్న భయంతో ఆ ఆర్ద్రతని చంపేసి కమెర్షియల్ గా యూత్ కథ చెప్పమని అడగొచ్చు. 

కానీ “బలగం” ఆ భయం వద్దని చెప్తున్నట్టయ్యింది. “నిన్ను కదిలించిన కథని పూర్తిగా నమ్మి తీసేయడమే..ఎక్కడా డౌట్ పడకుండా ఆర్గానిక్ గా మనసులో ఉన్నది చెప్పేయడమే”..ఇదే “బలగం” ఇచ్చే సందేశం. 

ఎంత చెప్పుకున్నా ఇక్కడ మరొక విషయం చెప్తున్నారు. దిల్ రాజు స్టాంప్ పడిన సినిమా కనుక మీడియా పట్టించుకుందని లేకపోతే అసలు జర్నలిష్టులే చూసే వారు కాదని, దాని వల్ల పబ్లిసిటీ కొరవడేదని ఒక టాక్ ఉంది. అందులో సత్యం లేకపోలేదు. అయినప్పటికీ అసలంటూ నమ్మిన కంటెంట్ తీస్తే, అదంటూ నచ్చితే దిల్ రాజులాంటి వాళ్లు విడుదల చేయడానికి ముందుకు వస్తారు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి తెలుగు సినిమా చరిత్రలో. 

ఆరిపోయిందనుకున్న చిన్న సినిమా జ్యోతిని నిలబెట్టి, చరిత్రలో కలిసిపోయిందనుకున్న ఆర్ట్ సినిమా ఫ్లావర్ ని మళ్లీ గుబాళింపజేసి మన ముందు పెట్టి విజయాన్ని పొందిన దర్శకుడు వేణు ఎందరో చిన్న నిర్మాతలకు, చిన్న సినిమాలకు మార్గదర్శి అవుతాడనడంలో సందేహం లేదు. 

అయితే అన్నీ “బలగం” సినిమాలు కావు. “బలగం” లాంటిదే మరొకటి అంటే ఫలితం ఉండకపోవచ్చు. “బలగం” స్ఫూర్తితో ఒక భిన్నమైన కథని, కొత్త బ్యాక్డ్రాపులో చెప్పగలగాలి. కథకులు ఆ ఆలోచనల్లో ఉండాలి. అప్పుడే “బలగం”, “కాంతార” వంటి సినిమాలొస్తాయి. 

శ్రీనివాసమూర్తి