ప్రధాని మోడీకి తెలంగాణాలోనే గో బ్యాక్ నినాదాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీలో ఆపాటి ముచ్చట ఏమీ లేదని బీజేపీ శ్రేణులు ఏమీ సంబరపడనక్కరలేదుట. ఎందుకంటే భీమవరంలో అలా మోడీ దిగడమేంటి ఇలా విశాఖ నుంచి అక్కడికి వినిపించేలా ఉక్కు కార్మిక ఉద్యమ నినాదాలు రీ సౌండ్ చేస్తాయట.
మోడీ విశాఖ వస్తే ఆయన ఎదుట నిరసన ప్రదర్శన చేయాలనుకున్న ఉక్కు కార్మిక ఉద్యమ నేతలకు నిరాశ కలిగేలా ఆయన టూర్ రద్దు అయింది. నిజానికి మొదట అనుకున్న ప్రకారం అయితే మోడీ జూలై 4న విశాఖ కూడా వస్తారని ప్రచారం అయితే జరిగింది.
విశాఖ మోడీ వస్తే మా స్టీల్ ప్లాంట్ సంగేతేంటని గట్టిగా అడగాలనుకున్న ఉక్కు కార్మిక నేతలు ఇపుడు కూడా ఏమీ తగ్గేదే లేదు అంటున్నారు. మోడీ ఏపీలో ఎక్కడకు వచ్చినా ఆయనకు వినిపించేలా రీ సౌండ్ చేయడానికి మేము రెడీ అంటున్నారు.
భీమవరంలో మోడీ కొలువు తీరి ఉన్న వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ఆందోళన చేపట్టడంతో పాటు గో బ్యాక్ మోడీ అంటూ నినదిస్తామని ఉక్కు కర్మాగారం పరిరక్షణ కమిటీ నాయకుడు డి ఆదినారాయణ చెబుతున్నారు.
మా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వరంగంలోనే ఉంచుతామని చెప్పేంతవరకూ మోడీ ఏపీకి ఎపుడు వచ్చినా ఇలాగే ఇదే తీరున భారీ ఎత్తున నిరసలను ఉంటాయని ఆయన స్పష్టం చేస్తున్నారు.