ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భారీ ఊరటనిచ్చింది. గతంలో ఎన్‌డీఏ భాగస్వామిగా ఉంటూ కూడా కేంద్రం నుంచి రెవెన్యూ ఆర్థిక లోటు నిధుల్ని రాబట్టలేకపోయారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం ఎట్టకేలకు భారీ మొత్తంలో రెవెన్యూ లోటు నిధుల్ని రాబట్టుకున్నారు. దీంతో ఎన్నికలకు ఏడాది ముందు జగన్ సర్కార్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊపరి తీసుకోడానికి వెసులుబాటు కల్పించినట్టైంది.
జగన్ సర్కార్‌కు కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడడాన్ని విపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆర్థిక ఇబ్బందులతో పథకాలను నిలిపేసి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటారని ఆశించిన ప్రతిపక్షాలకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం కోపం తెప్పిస్తోంది. బీజేపీతో వైసీపీ అనుబంధాన్ని మరోసారి ఈ ఎపిసోడ్ నిరూపిస్తోందని ఎల్లో మీడియా అప్పుడే కూడై కూస్తోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అందించిన సాయం గురించి తెలుసుకుందాం.
2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు కింద రూ.10,460.87 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ (వ్యయ) అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలు ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ఈ నిధుల్ని విడుదల చేయాలని మహేంద్ర తెలిపారు. ఆర్థికంగా ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలబడడం సంతోషించదగ్గ విషయం.
ఇదే సందర్భంలో మన ప్రభుత్వం అనుకుని సచివాలయాలు, రోడ్లు, ఇతరత్రా భవనాలు, అలాగే చిన్నాపెద్దా పనులు చేసి, బిల్లుల కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్న అధికార పార్టీ నాయకులకు ఆశలు చిగురించాయి. భారీ మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు సొమ్ము చేరనున్న నేపథ్యంలో ఇప్పటికైనా బిల్లులకు మోక్షం కలిగించాలని కాంట్రాక్టర్లు, వైసీపీ నేతలు సీఎం జగన్‌ను డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులను ఆర్థికంగా బలోపేతం చేసి, అండగా నిలిస్తేనే మరోసారి జగన్ కోసం పని చేసే అవకాశం వుంది. లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసి, ప్రత్యర్థులకు అండగా నిలిచే ప్రమాదం వుంది.
వైసీపీ గ్రామ, మండల స్థాయి నాయకులకు కనీసం కోటి, రెండు కోట్ల రూపాయల బిల్లులను ఎక్కువగా చెల్లించాల్సి వుంది. ఇలాంటి చిన్నచిన్న బిల్లుల్ని చెల్లిస్తే, వైసీపీ నాయకులు మళ్లీ యాక్టీవ్ అవుతారు. మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనే పట్టుదలతో ఎన్నికల కదనరంగంలో దూకుతారు. ఇప్పుడు భారీ మొత్తంలో ఆర్థిక సాయం అందిన నేపథ్యంలో వారి నుంచి బిల్లుల చెల్లింపుల డిమాండ్లు వస్తున్నాయని గ్రహించాలి. బిల్లుల చెల్లింపులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి వుంది.
ఇంకా ఆ పథకం, ఈ పథకం అంటూ, బిల్లుల చెల్లింపు అంశాన్ని పక్కన పెడితే… అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ పెద్దలు గ్రహించాల్సి వుంది.