మాజీ మంత్రి, ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిలప్రియను ఆమె చెల్లి మౌనిక, మరిది మంచు మనోజ్ అదును చూసి దెబ్బ కొడుతున్నారు. ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో, అక్కడ టీడీపీకి పెద్ద దిక్కుగా వుండేందుకు మంచు మనోజ్, మౌనిక రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. నంద్యాలో లోకేశ్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్ తదితర నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆళ్లగడ్డలో లోకేశ్ పాదయాత్ర సమయానికి అఖిలప్రియ లేకపోవడం పెద్ద లోటే. సోమవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్ర అట్టర్ ప్లాప్ అనే టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు బనగానపల్లెలో రోజూ 10 వేలకు తక్కువ కాకుండా జనంతో బీసీ జనార్దన్‌రెడ్డి పాదయాత్రను సక్సెస్ చేశారు.
ఆళ్లగడ్డకు వచ్చే సరికి 2 వేల మందికి మించిలేరు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర పూర్తి అవుతుంది. అఖిలప్రియ జైల్లో వుండడం, భూమా మౌనికకు రాజకీయ అకాంక్ష ఉన్న పరిస్థితిలో… అక్కడ ఎంటర్ కావడానికి ఇదే తగిన సమయం అని మంచు మనోజ్ ఎత్తుగడ వేశారు. దీంతో లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొనడానికి మంచు మనోజ్, మౌనిక ఆళ్లగడ్డకు వస్తున్నట్టు సమాచారం. ఇవాళ ఆళ్లగడ్డలో లోకేశ్ మాట్లాడనున్నారు.
వివిధ కేసుల్లో ఇరుక్కున్న అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతుండడం, ఇదే సందర్భంలో దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మౌనిక ఎత్తుగడ వేసినట్టు చెబుతున్నారు. భర్తతో కలిసి ఆమె ఆళ్లగడ్డ రాజకీయాల్లో పాగా వేయడానికి లోకేశ్ పాదయాత్రను వేదికగా చేసుకోనున్నారు. జైల్లో ఉన్న అక్కను పరామర్శించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం ఆళ్లగడ్డకు మౌనిక వెళ్లడంపై మాజీ మంత్రి అనుచరులు మండిపడుతున్నారు.
మంచు మనోజ్ సినీ గ్లామర్‌కు తోడు ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి ఉన్న ఆదరణ తనకు కలిసొస్తుందని మౌనిక భావిస్తున్నారు. అక్కపై తీవ్ర వ్యతిరేకత ఉందని టికెట్ నిరాకరిస్తే, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని టీడీపీ అధిష్టానాన్ని మౌనిక కోరనున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆళ్లగడ్డ రాజకీయాలు రంజుగా మారనున్నాయి.