శభాష్ పోలీస్! ఇంతకంటే బాగా ఎవరు చేయగలరు?

‘పలాసలో తెలుగుదేశం కార్పొరేటర్ ఇళ్లను అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నించారు’– ఇది తెలుగుదేశం ఆరోపణ! ‘చెరువు స్థలాన్ని ఆక్రమించుకొని చేసిన నిర్మాణాలను తొలగించడానికి మాత్రమే ప్రయత్నించాం’.. అనేది ప్రభుత్వాధికారుల వివరణ!! ఇది పూర్తిగా ‘‘ఆక్రమణలు– అందులో…

‘పలాసలో తెలుగుదేశం కార్పొరేటర్ ఇళ్లను అధికారులు కూల్చివేయడానికి ప్రయత్నించారు’– ఇది తెలుగుదేశం ఆరోపణ! ‘చెరువు స్థలాన్ని ఆక్రమించుకొని చేసిన నిర్మాణాలను తొలగించడానికి మాత్రమే ప్రయత్నించాం’.. అనేది ప్రభుత్వాధికారుల వివరణ!! ఇది పూర్తిగా ‘‘ఆక్రమణలు– అందులో నిజానిజాలు’’ అనే అంశానికి సంబంధించిన వ్యవహారం! వారి ఇళ్లు ఆక్రమణలు కాదు చాలా నిజాయితీగా నిబంధనల మీరకుండా కట్టుకున్న ఇళ్లే అనే నమ్మకం వారికి ఉన్నట్లయితే.. వారు చక్కగా కోర్టును ఆశ్రయించవచ్చు. 

అక్కడి నుంచి తీర్పు తెచ్చుకుని తమ నివాసాలకు రక్షణ కల్పించుకోవచ్చు. ఆ పని ఏమీ చేయకపోగా అక్కడ మరింత ఉద్రిక్తతలని సృష్టించడానికి ప్రయత్నించారు. లోకేష్ కూడా అక్కడ పర్యటించాలని నిర్ణయించుకున్నారు. ఈరోజున పోలీసుల వ్యవహార సరళి శెభాష్ అనిపించే తీరులో ఉంది! ఈరోజు ఘటనలను వరుస క్రమంలో పరిశీలిస్తే పోలీసులు వ్యవహరించినంత సంయమనంతో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం మరొకరు వ్యవహరించలేరని మనకు అర్థమవుతుంది!

మంత్రి సీదిరి అప్పలరాజును ఉద్దేశించి, గౌతు శిరీష నానా మాటలు అన్నారు. అందుకు నిరసన వ్యక్తం చేస్తూ టిడిపి కార్యాలయాన్ని ముట్టడించాలని వైసీపీ పిలుపు ఇచ్చింది. అధికార పార్టీ గనుక వారి పిలుపునకు స్పందన కూడా బాగానే ఉంది. జనం ఎగబడి వచ్చారు. అయితే పోలీసులు వారి ముట్టడి కార్యక్రమాన్ని కూడా ఆదిలోనే అడ్డుకున్నారు. ర్యాలీ తీయడానికి వచ్చిన వైసీపీ కార్యకర్తలు అందరిని అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించి విడిచి పెట్టారు. 

ప్రధాన ప్రత్యర్థులు అయిన రెండు పార్టీలు స్థానికంగా ప్రజల మధ్య ఉద్రిక్తతలు సృష్టించగల స్థాయిలో ఒకేరోజు రెండు వేరువేరు కార్యక్రమాలకు పిలుపు ఇచ్చినప్పుడు పోలీసులు ఆ రెండింటినీ అడ్డుకున్నారు! ఎవరి పట్ల కూడా ప్రేమానురాగాలను, విద్వేషాలను చూపించలేదు. ఇంతకంటే సమర్థంగా పోలీసులు వ్యవహరించడం ఎలా సాధ్యమవుతుంది? పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించడం ఎలా కుదురుతుంది? నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్నందుకు మాత్రం తెలుగుదేశం నాయకులు ఎందుకంత నానా యాగీ చేస్తున్నారు? ఎందుకంత గొంతు చించుకుంటున్నారో వారికి మాత్రమే తెలియాలి!!

నిజానికి నారా లోకేష్ పట్ల పోలీసులు చాలా గౌరవంగా వ్యవహరించినట్టు మనం అనుకోవాలి. లోకేష్ ఉత్తరాంధ్ర విజిట్ కు సంబంధించి టూర్ షెడ్యూల్ను ముందే విడుదల చేశారు. ఉద్రిక్తతల కారణంగా పలాస వెళ్లడాన్ని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. ఆయన పోలీసులతో గొడవ పెట్టుకుని తనకు మైలేజీ సృష్టించుకోవాలని ప్రయత్నించిప్పటికీ, ఆయన షెడ్యూల్‌కు అనుగుణంగా ఆ తర్వాత విశాఖపట్నంలో నిశ్చితార్థం కార్యక్రమానికి హాజరయ్యేలా పోలీసులే చూశారు. తిరిగి మళ్లీ ఇంకెో పెళ్లికి వెళ్తానంటే, అది కూడా ఉద్రిక్తతలకు కారణం కాగలదనే ఉద్దేశంతో అడ్డుకున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో లోకేష్ పట్ల వాళ్లు వ్యతిరేకంగా ప్రవర్తించినది ఎక్కడ కనిపిస్తోంది? పోలీసుల వ్యవహారంలో శాంతిభద్రతల కోణం తప్ప మరొకటి లేదు!

కానీ తెలుగుదేశం మాత్రం, రచ్చచేయడానికి ప్రయత్నించడం.. పోలీసులు అడ్డుకుంటే వారిమీద మాటలతో ఎదురుదాడి చేయడం ద్వారా తమకు మైలేజీ పెంచుకోవాలని ఆరాటపడడం అనే ధూర్తనీతిని అనుసరిస్తోంది. పచ్చమీడియా కూడా.. లోకేష్ ను అడ్డుకున్న వ్యవహారాన్ని తాటికాయంత పెద్దదిగా చూపిస్తూ, వైసీపీ వారి ముట్టడిని కూడా పోలీసులు అడ్డుకున్నప్పటికీ.. దానిని చాలా పరిమితమైన కవరేజీతో ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు వ్యాపించడానికి సహకరిస్తోంది. 

పోలీసులు మాత్రం.. ఈ రాజకీయ వేషాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా.. శాంతిభద్రతలు ఒక్కటే తమ ఎజెండా అన్నట్టుగా తమ పని తాము చేసుకుపోతున్నారు. అందుకే వారిని శెభాష్ అనాలి.