హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాయలసీమ సమాజం ప్రశంసిస్తోంది. ఈ మేరకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రాంతమైన కర్నూలులో కృష్ణా నదీ యాజమాన్యం బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేయాలని జలశక్తి స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంజయ్ జైశ్వాల్‌ను గోరంట్ల మాధవ్ కోరడం విశేషం. జలశక్తి స్టాండింగ్ కమిటీ నిర్వహించిన సమావేశంలో రాయలసీమ ఎంపీ గోరంట్ల మాధవ్ సీమ సమాజ ఆకాంక్షలకు తగ్గట్టు మాట్లాడ్డం ప్రశంసలు అందుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో వివాదాలకు తావు లేకుండా పరిష్కరించేందుకు బోర్డులు ఏర్పాటయ్యాయి. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని 2014లో ఏర్పాటు చేశారు. ఇది కేంద్ర జలవనరుల శాఖ పరిధిలో పనిచేసే స్వయంప్రతిపత్తి గల సంస్థ. కృష్ణా బేసిన్‌లో నదీ జలాల నిర్వహణ, నియంత్రణ ఈ బోర్డు చూస్తుంది. నదీ జలాల విషయంలో కీలకమైన ఈ బోర్డు రాయలసీమలో ఉండాలని సీమ ప్రజానీకం కోరుతోంది. కానీ సీమ ఆకాంక్షలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వ ప్రతిపాదన ఉండడం గమనార్హం.
ఇదే సందర్భంలో తన ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గోరంట్ల మాధవ్ జలశక్తి స్టాండింగ్ కమిటీకి విన్నవించడం ప్రాధాన్యం సంతరించుకుంది. కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విజయవాడలో పెట్టాలని గతంలో చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర జలశక్తికి లేఖ రాసింది. అది ప్రతిపాదనల దశలో ఆగిపోయింది.
ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విజయవాడకు బదులు విశాఖలో ఏర్పాటు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సంబంధం లేని విశాఖలో బోర్డు ఏర్పాటు చేయాలనే ఏపీ ప్రతిపాదనపై భారీగా విమర్శలొచ్చాయి. ఈ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని మొదటి నుంచి సీమ సమాజం డిమాండ్ చేస్తోంది.
సీమ డిమాండ్‌ను నాడు చంద్రబాబు ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పెడచెవిన పెట్టడం గమనార్హం. విశాఖలో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు మెంబర్ సెక్రటరీ మీనా కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. కేఆర్ఎంబీని ఏపీకి తరలించాలన్న ప్రతిపాదనకు విరుద్ధంగా హిందూపుం ఎంపీ గోరంట్ల మాధవ్ కోరడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఇది ప్రభుత్వానికి తెలిసి చేస్తున్నారా? లేక ధిక్కరించి ముందుకు వెళుతున్నారా? అనే చర్చకు తెరలేచింది. గోరంట్ల మాధవ్ మాత్రం మంచి పని చేశారని, ఆయన ప్రయత్నం ఫలిస్తే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.