తాను ఏదైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడొచ్చు అని చంద్రబాబు బలంగా నమ్ముతారు. అందుకే ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడంతో పాటు వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. అలాంటి వ్యక్తి తన పార్టీపై అధికార పార్టీ కుట్రలు చేస్తుందని తాజాగా ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యపోవడం జనం వంతైంది. అంతటితో ఆయన ఆగలేదు.
ముందస్తు ఎన్నికలపై తానే జోష్యం చెప్పి, మళ్లీ ఎందుకు వెళుతున్నావని ప్రశ్నించడం విచిత్రంగా ఉంది. కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు ఏమన్నారంటే…
‘త్వరలోనే ఎన్నికలు వస్తాయని కొందరు అంటున్నారు. ఐదేళ్లు పరిపాలించే దమ్ము.. సత్తా ఈ ముఖ్యమంత్రికి లేదని తేలిపోయింది. పాలన చేతకాని అసమర్థ సీఎం జగన్’ అని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ఇదే చంద్రబాబు 2003లో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని ఏపీ సమాజం మరిచిపోయినట్టున్నారు. నాడు అలిపిరిలో తనపై నక్సల్స్ మందుపాతర్లు పెట్టి పేల్చడాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు.
నాడు తొమ్మిది నెలలు ముందుగా ఎన్నికలకు వెళ్లారు. చివరికి పునర్జన్మ పొందానని, ఏపీకి సేవ చేసేందుకే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి కాపాడారని ప్రచారంలో చెప్పినా, జనం మాత్రం కరుణించలేదు. బాబు నాయకత్వంలోని టీడీపీని మట్టికరిపించారు. 2004లో వైఎస్సార్‌కు పట్టం కట్టారు. 2009లో కూడా రెండో సారి వైఎస్సార్‌కు నీరాజనం పలికారు. పాలన చేతగాకే ముందస్తు ఎన్నికలకు వెళ్లావా? అనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఏంటి?
ఇప్పుడు జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చంద్రబాబే విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మళ్లీ తానే ఐదేళ్లు పాలించే దమ్ము, సత్తా జగన్‌కు లేవని విమర్శిస్తున్నారు. భారతదేశంలోనే డర్టీయెస్ట్ పొలిటీషియన్ చంద్రబాబు అని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటే ఏంటో అనుకున్నాం కానీ, ఇలాంటి మాటలు వింటే…తిట్లు తక్కువే అనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.