తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. హిందూ ధర్మ వ్యాప్తికి శ్రీకారం చుట్టిన ప్రత్యేక కార్యక్రమం గా ఆయన దీనిని పేర్కొంటున్నారు గానీ, ఇందులో అంతకంటే విశిష్టమైన ప్రయోజనాలే ఉన్నాయి.
25 ఏళ్ల లోపు యువతరం కోటి గోవింద నామాలు రాయడాన్ని పూర్తిచేస్తే వారి కుటుంబం మొత్తానికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా యువతీ యువకులు ఎవరైనా 10,01,116 గోవింద నామాలు రాస్తే గనుక ఆ వ్యక్తి ఒక్కరికి బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు కూడా వెల్లడించారు. నిజానికి భగవద్భక్తిని పెంపొందింప చేయడం దిశగా చూసినప్పుడు ఈ నిర్ణయం మంచిదే.
గోవింద నామాలు రాసేవారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించడం ద్వారా కేవలం ధర్మవ్యాప్తి జరుగుతుందని అనుకోవడం మాత్రమే కాదు.. నిజంగా చిత్తశుద్ధి, భక్తి భావం ఉండేవారికి టీటీడీ విలువ ఇచ్చినట్లు కూడా అవుతుంది. కేవలం ప్రోటోకాల్ స్థాయిలో ఉండే వారికి, పదివేల రూపాయల డబ్బు శ్రీవాణి ట్రస్ట్ కోసం చెల్లించ గలిగిన వారికి, సిఫారసు లెటర్లు పుట్టించుకోగలిగిన వారికి మాత్రమే ప్రాప్తం అయ్యే వీఐపీ బ్రేక్ దర్శనం భక్తి భావం తప్ప మరేమీ లేని సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు టీటీడీని అభినందించాల్సిందే.
అయితే ఇక్కడ ఒక సందేహం ఉంది. గోవిందనామాలు రాసే భక్తులకు ప్రోటోకాల్ లేదా శ్రీవాణి భక్తులతో పాటుగా వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారా? సిఫారసు ఉత్తరాలు పొందేవారితో కలిపి పంపుతారా? అనేది స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఈ నిర్ణయాన్ని కార్యరూపంలోకి తెచ్చే ముందు మరికొన్ని అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
కేవలం యువతి యువకులకు మాత్రమే ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నారు. గోవింద కోటి రాసిన, లేదా 10 లక్షల గోవింద నామాలు రాసిన ఏ భక్తుడికైనా సరే ఇలాంటి అవకాశం ఇవ్వవచ్చు కదా అనేది భక్తుల వైపు నుంచి ఎదురవుతున్న సందేహం. అందరికీ వర్తింపజేసినట్లయితే గృహిణులు, వృద్ధులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఈ దిశగా టిటిడి ఆలోచన చేయాలని పలువురు అభ్యర్థిస్తున్నారు.
10 లక్షల గోవింద నామాలను రాయడం అయినా సరే అంత సునాయాసమైన సంగతేమీ కాదు కాబట్టి అంతటి శ్రద్ధ భక్తి ఉన్నవారికి ఒకసారి అవకాశం కల్పించడంలో నష్టం లేదని భక్తులు భావిస్తున్నారు.