పీఎం కేండిడేట్: శరీరమూ, మెదడూ రెండూ ఆబ్సెంట్!

విపక్షాల తరఫున ఇం.డి.యా. కూటమి మోడీని ఓడించడానికి కృతనిశ్చయంతో సమైక్యమవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. చిన్నా సన్నా చిల్లర పార్టీల విషయంలో తప్ప ఆ కూటమిలోకి అడుగుపెడుతున్న ప్రతి పెద్ద పార్టీ నాయకుడికి కూడా…

విపక్షాల తరఫున ఇం.డి.యా. కూటమి మోడీని ఓడించడానికి కృతనిశ్చయంతో సమైక్యమవుతున్న సంగతి తెలిసిందే. అయితే.. చిన్నా సన్నా చిల్లర పార్టీల విషయంలో తప్ప ఆ కూటమిలోకి అడుగుపెడుతున్న ప్రతి పెద్ద పార్టీ నాయకుడికి కూడా తామే కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు కావాలన్నంత బలీయమైన కోరిక ఉంది. 

ఎంతగా అంటే.. కనీసం ఆ కూటమికి కన్వీనరుగా ఒకరి పేరును ప్రకటించడానికి కూడా వారికి సాహసం చాలడం లేదు. ఒకరిపేరును కన్వీనరుగా ప్రకటిస్తే.. ఆ పేరే ప్రధాని అభ్యర్థి పేరుగా భావించినట్లు ప్రజల్లోకి సంకేతాలు వెళతాయేమో అని వారి భయం. దానివలన మిగిలిన పార్టీలు కూటమికి దూరం అవుతాయేమో అని కూడా భయం. ఆ రకంగా ఆ కూటమిలో ఉన్న అనేకానేకమంది ప్రధాని పదవి ఆశావహుల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఒకరు. 

‘అబ్బెబ్బే.. నాకు పీఎం పోస్టు మీద ఆశ లేనే లే’ అని ఆయన చాలా తరచుగా చెబుతూ ఉంటారు. కానీ.. అందరూ కలసి తన పేరు చెప్పాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి నితీశ్ కుమార్ కు శరీరమూ, మెదడూ రెండూ సరిగా సహకరించడం లేదేమోననే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

సీఎం నితీశ్ పట్నా యూనివర్సిటీలో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయన పట్టుకోల్పోయి వేదికపై కింద పడిపోయారు. అధికారులు చిటికెలో అప్రమత్తమై ఆయనను పైకి లేపాల్సి వచ్చింది. ఆ రకంగా ఆయనకు శరీరం సహకరించడం లేదు.

మెదడు సహకరించడం లేదని చెప్పే ఉదాహరణ ఇంకా చిత్రమైనది. నితీశ్ కుమార్ ‘జనతా దర్బార్’ పేరుతో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఒక వ్యక్తి నుంచి ఫిర్యాదును విన్న నితీశ్.. అధికారుల వైపు తిరిగి ‘‘రాష్ట్ర హోం మంత్రికి ఫోను చేయండి.. ఆయనతో నేను ఇప్పుడే మాట్లాడాలి..’’ అంటూ హూంకరించారు. నోరెళ్లబెట్టడం అధికారుల వంతైంది. 

ఎందుకంటే.. బీహార్ లో హోంమంత్రిత్వ శాఖను కూడా ముఖ్యమంత్రి నితీశే నిర్వహిస్తున్నారు. తాను హోం మంత్రిని కూడా అనే సంగతి ఆయన ‘మరిచిపోయారు’! అధికారులు జవాబివ్వకపోవడం విసిగిపోయిన నితీశ్ ఎదురుగా ఉన్న మరో మంత్రి విజయ్ చౌదరిని చూపించి.. ఆయనను నా పక్కన కూర్చోమని చెప్పండి- అన్నారు. కాసేపటికే ‘ఆయన కాదులెండి’అంటూ మరోసారి తడబడ్డారు. ఇలా ఆయనకు పాపం మెదడు కూడా సహకరించడం లేదేమో అని జనం అనుకున్నారు.

శరీరమూ, మెదడూ రెండూ సహకరించకపోయినా.. నితీశ్ కుమార్ కు ఆశ మాత్రం పుష్కలంగానే ఉంది. ‘మోడీని పడగొట్టాలి.. అందరి కోరికమేరకు తాను ప్రధాని కావాలి’ అని కోరుకుంటున్నారని జనం నవ్వుకుంటున్నారు.