7200 వజ్రాలతో అత్యంత ఖరీదైన బహుమతి

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 73వ ఏట అడుగుపెడుతున్నారు. ఎన్నికల సీజన్ కూడా కావడంతో, బీజేపీ వర్గాలు, మోదీ అభిమానులు ఈ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి నిర్ణయించారు.…

ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 73వ ఏట అడుగుపెడుతున్నారు. ఎన్నికల సీజన్ కూడా కావడంతో, బీజేపీ వర్గాలు, మోదీ అభిమానులు ఈ బర్త్ డే ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి నిర్ణయించారు.

ఈ సందర్భంగా ప్రధానికి అత్యంత అరుదైన, ఖరీదైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు సూరత్ కు చెందిన ఆర్కిటెక్ట్ ఇంజనీర్ విపుల్ జేపీ వాలా. అనుకున్నదే తడవుగా 7200 వజ్రాలతో మోదీ చిత్రపటాన్ని తయారుచేశాడు.

ఇదేదో రికార్డ్ కోసం చేసిన ప్రయత్నం కాదు. ఈ వేల వజ్రాలతో తయారుచేసిన ఫొటో ఫ్రేమ్ ను ప్రధానికి బహుమతిగా అందించబోతున్నాడు ఈ ఆర్కిటెక్ట్.

వేలాది వజ్రాలతో కూడిన ఈ చిత్రాన్ని రూపొందించడానికి సుమారు మూడున్నర నెలల సమయం పట్టిందంటున్నాడు ఈ నిపుణుడు. ఇందులో 4 రకాల వజ్రాలను ఉపయోగించాడట. 7200 వజ్రాలతో తయారు చేయడానికి ఎంత ఖర్చయిందనే విషయాన్ని మాత్రం అతడు బయటపెట్టలేదు.

ఇంతకీ ఇతడికి ఈ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసా.. ఆ మధ్య అమెరికా వెళ్లినప్పుడు అధ్యక్షుడు జో బిడెన్ భార్యకు, ప్రధాని ఓ వజ్రాన్ని బహుమతిగా ఇచ్చారు. అది చూసి ఇతగాడికి వజ్రాలతో మోదీ బొమ్మ తయారచేయాలనే ఆలోచన కలిగిందంట.

గతంలో సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ప్రధాని మోదీకి 'నరేంద్ర దామోదర్ దాస్' అని రాసి ఉన్న సూట్ ను బహుమతిగా ఇచ్చాడు. 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన సందర్భంగా ప్రధాని మోదీ దీన్ని ధరించారు.

ఆ తర్వాత ఆ సూట్ ను 4 కోట్ల 31 లక్షల రూపాయలకు వేలం వేశారు మోదీ. ఆ డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉపయోగించారు. తనకొచ్చిన బహుమతుల్ని వేలం వేసి, ఆ వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉపయోగిస్తానని, ప్రధాని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.