ఆత్మకూరులో ఉప ఎన్నికల ప్రచారానికి 2 రోజులే సమయం ఉంది. ఓ మండలానికి ఇంచార్జిగా ఉన్న కొడాలి నాని అస్సలు రాలేదు, మరో మండలానికి ఇన్ చార్జిగా ఉన్న ఓ మాజీ మంత్రి జిల్లావాసే అయినా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆత్మకూరుకి వచ్చి ఓ కల్యాణ మండపంలో కాసేపు ప్రెస్ మీట్ ముచ్చట్లు పెట్టి వెళ్లిపోతున్నారే కానీ క్షేత్ర స్థాయిలో పర్యటించడం లేదు.
కష్టమంతా విక్రమ్ రెడ్డిదే. ఆ మాటకొస్తే మంత్రి రోజా చాలా బెటర్. తన సొంత ప్రచార వాహనాన్ని ఆమె నగరి నుంచి తెప్పించుకున్నారు, ఎండలో సైతం పర్యటనలు చేస్తున్నారు. మిగతా బ్యాచ్ అంతా.. షో చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. లక్ష మెజార్టీ ఖాయం అనుకుని వీరంతా లైట్ తీసుకున్నారని తెలుస్తోంది.
మేకపాటి ప్రచారం ఎలా సాగుతోంది..?
ఆత్మకూరులో అభ్యర్థి విక్రమ్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నోటిఫికేషన్ కి కొన్నిరోజుల ముందుగానే ఆయన అక్కడ పరిచయ కార్యక్రమాలు పెట్టుకున్నారు, నియోజకవర్గ ఇన్ చార్జి హోదాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈలోగా నోటిఫికేషన్ రావడంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఒక రకంగా ఆయన నియోజకవర్గంలో ప్రతి ఊరూ చుట్టేసి వచ్చారు, నాయకులందరితో కలసిపోయారు.
మంత్రులు, ఇంచార్జ్ లు ఏం చేయాలి..?
మంత్రులు, ఇంచార్జ్ లు గా ఉన్నవారు ఏం చేయాలి.. స్థానికంగా అభ్యర్థి విజయానికి ఎలా కృషి చేయాలి..? క్షేత్ర స్థాయిలో పర్యటించి పార్టీ శ్రేణుల్ని ఎలా సమాయత్త పరచాలి..? వీటన్నిటికీ లెక్కలున్నాయి. కానీ ఈ లెక్కలు ఊరిలో రచ్చబండ దగ్గర వేస్తే దానికి మంచి ఫలితం ఉంటుంది. ఏదో ఒక కల్యాణ మండపం బుక్ చేసుకుని.. కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడివారక్కడ గప్ చుప్ అంటే ఫలితం ఎలా ఉంటుంది..?
ఓవైపు బీజేపీ ఏకంగా కేంద్ర మంత్రుల్ని రంగంలోకి దింపుతోంది.. రాజ్య సభ సభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక నాయకులు.. ఇలా ఒకరేంటి.. రాష్ట్రంతో సంబంధంలేని నాయకులు కూడా ఆత్మకూరు ప్రచారానికి వచ్చారు, వస్తున్నారు. పురంద్రీశ్వరి ఇచ్చిన కౌంటర్లకు బదులు చెప్పేందుకు ఆత్మకూరులో వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారే కానీ.. జనాల్లోకి మాత్రం వెళ్లడం లేదు.
రోజాకి మినహాయింపు..
మంత్రి రోజా చేజర్ల మండలానికి ఇన్ చార్జిగా ఉన్నారు. ఆమె నగరి నుంచి తన ప్రచార రథాన్ని తెప్పించుకుని మరీ విక్రమ్ రెడ్డి తరపున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆత్మకూరు నుంచి వినిపించిన విమర్శల్లో.. రోజా పేల్చిన పంచ్ డైలాగులే అందర్నీ ఆకట్టుకున్నాయి. మహిళా మంత్రి అయినా రోజా కష్టపడుతున్నారే కానీ.. మగమహారాజులు మాత్రం కదలక మెదలక మమ అనిపిస్తున్నారు.
తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావడంతో.. ఇప్పుడీ ఎండల్లో ప్రచారం ఎందుకని లైట్ తీసుకున్నారేమో.. ఆత్మకూరుకి ఇలా వచ్చి అలా వెళ్తున్నారు నాయకులు. తాముకూడా ప్రచారానికి వచ్చామని అనిపించుకుంటున్నారు.