బీఆర్ఎస్ డొల్లతనాన్ని ఎండగట్టిన గుడివాడ

చెప్పను బ్రదర్ అంటూనే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మీద బాగానే సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమరనాధ్. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అది ఏపీ ప్రజల సెంటిమెంట్. ప్లాంట్…

చెప్పను బ్రదర్ అంటూనే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ మీద బాగానే సెటైర్లు వేశారు ఏపీ మంత్రి గుడివాడ అమరనాధ్. స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అది ఏపీ ప్రజల సెంటిమెంట్. ప్లాంట్ ని లాభనష్టాలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వమే నడపాలని వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది ఈ విషయంలో రెండవ మాట లేనే లేదని అన్నారు.

పొరుగున ఉన్న బీఆర్ఎస్ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మవద్దు అంటూ కేంద్రాన్ని ఒక పక్క కోరుతూనే మరో వైపు కేంద్రం అమ్మకానికి పెడితే బిడ్డింగులో పాల్గొంటామని ఎలా అంటుందని గుడివాడ అంటున్నారు. ఒక వైపు స్టీల్ ప్లాంట్ ని అలాగే ఉంచాలని కోరుతున్నపుడు ఈ అమ్మకాలు కొనుగోళ్ల ప్రసక్తి ఎందుకు వస్తుందని ఆయన కరెక్ట్ పాయింట్ నే లేవనెత్తారు.

ఉక్కు కర్మాగారం ప్రైవేటేజేషన్ విధానాల మీద కేంద్రం పైన పోరాటం చేస్తామని ఈ మధ్యనేబీఆర్ఎస్ ప్రకటించింది. అంతలోనే కేంద్రం అమ్మకానికి పెడితే బిడ్ వేస్తామని బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయంలో అధికారికంగా బీఆర్ఎస్ ఏమిటి చెబుతుంది అన్నది చూసే మాట్లాడుతామని గుడివాడ అంటూనే బీఆర్ఎస్ ఉక్కు పోరాటం వెనక డొల్లతనాన్ని ఎండగట్టారు అని అంటున్నారు. కేంద్రం ముందు ప్రైవేటీకరణకు వ్యతిరేకం మా విధానం అని గట్టిగా పోరాటం చేయాలి కదా అని వైసీపీ మంత్రి అంటున్నారు.

మా స్టాండ్ వెరీ క్లియర్, మేము ఉక్కుని ప్రైవేట్ పరం కానీయమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణా వారి స్టాండ్ కూడా ఏంటో తెలియాలి అంటూ ఇప్పటిదాక ఉక్కు మీద వారు చేస్తున్న ప్రకటనలను పూర్వపక్షం చేసేలా గుడివాడ మాట్లాడారు. వైసీపీ మంత్రి చెప్పాల్సింది చెప్పేశాక బీఆర్ఎస్ నేతలు దీని మీద చెప్పాల్సింది ఏమైనా ఉందేమో ఆలోచించాలి.