బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామాపై ఎట్టకేలకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. మొదట కన్నా బీజేపీని వీడుతున్నారనే ప్రచారంపై తాను స్పందించనని ఇవాళ ఉదయం జీవీఎల్ అన్నారు. కన్నా రాజీనామాపై తమ అధిష్టానంతో మాట్లాడినట్టు జీవీఎల్ చెప్పారు.
ముఖ్యంగా రాజీనామాకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజే వైఖరే కారణమని, ఆయన ప్రవర్తన నచ్చలేదని కన్నా అనడంపై జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవన్నారు.
సోము వీర్రాజుపై కన్నా వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. సోము వీర్రాజు తీసుకున్న ప్రతి నిర్ణయం అధిష్టానం ఆదేశాల మేరకే అని ఆయన చెప్పుకొచ్చారు. కన్నా లక్ష్మీనారాయణకు తమ పార్టీ సముచిత స్థానం కల్పించిందన్నారు.
సాధారణంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు వెంటనే రాష్ట్ర బాధ్యతలు అప్పగించిందన్నారు. కానీ కన్నా విషయంలో అలా జరగలేదన్నారు. ఆయనకు రాష్ట్ర నాయకత్వ బాధ్యతల్ని అధిష్టానం ఇచ్చిందన్నారు. ఆ తర్వాత జాతీయ కార్యవర్గంలోకి తీసుకుందని జీవీఎల్ గుర్తు చేశారు. కాపుల రిజర్వేషన్, అలాగే వంగవీటి మోహన్‌రంగా పేరుకు సంబంధించి తనపై కన్నా విమర్శలకు స్పందించనని ఆయన తేల్చి చెప్పారు.