నువ్వే మా నమ్మకం జగనన్న అని వైసీపీ మరోసారి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం చంద్రబాబుకు నచ్చడం లేదు. దీంతో జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నమ్మకం కాదు, నువ్వే రాష్ట్రానికి దరిద్రం అంటూ వ్యంగ్యస్త్రాన్ని విసిరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబుకు అదే స్థాయిలో ఆయన కౌంటర్ ఇచ్చారు.
కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని కన్నబాబు తిప్పికొట్టారు. నారా లోకేశ్ ఐరన్ లెగ్ అని మండిపడ్డారు. గుంటూరు, కందుకూరులలో అమాయ కులను చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. 2019 తర్వాత టీడీపీ కనీసం ఒక్క ఎన్నికల్లో అయినా గెలిచిందా? అని కన్నబాబు ప్రశ్నించారు. టీడీపీకి అంత సీన్ లేదని, చాలా బలహీనంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
అందుకే మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబును మించిన సైకో ఎవరూ లేరని విమర్శించారు. తమ ప్రభుత్వంపై బురదజల్లడమే టీడీపీ ఎజెండాగా వుందన్నారు. సీఎం జగన్‌ను పదేపదే సైకో సీఎంగా విమర్శించడం ద్వారా ప్రజల మైండ్‌సెట్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దాన్ని తిప్పికొట్టడంలో వైసీపీ ఎందుకనో దూకుడు ప్రదర్శించడం లేదు.
తాజాగా కన్నబాబు ఎదురు దాడిని చూస్తే… రానున్న రోజుల్లో వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశాలున్నాయి.