కాపు కురువృద్ధుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య తనను పవన్‌కల్యాణ్ ఛీ కొట్టినా పట్టించుకోవడం లేదు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కూటమి నిర్వహించిన బహిరంగ సభలో హరిరామజోగయ్యకు పవన్ పరోక్ష వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే
“మీ సలహాలొద్దు. నాకు సలహాలివ్వడం ఏంటి? నా విధానాలు నచ్చి వెంట నడిచే వాళ్లే నా వాళ్లు” అని చేగొండిని దృష్టిలో పెట్టకుని పవన్ సీరియస్ కామెంట్స్ చేశారు. మీ ఖర్మ అంటూ చేగొండి అదే రోజు సోషల్ మీడియా వేదికగా చేగొండి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సలహాలు, సూచనలు ఇచ్చే వారిపై పవన్ కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి చేగొండి సుదీర్ఘ లేఖను పవన్‌కు రాయడం విశేషం. పవన్ శ్రేయోభిలాషిగా ఆయనకు అన్ని వేళలా తన మద్దతు వుంటుందని చేగొండి పేర్కొనడం విశేషం. ఇదే సందర్భంలో చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాపై తీవ్ర విమర్శలు చేశారు. అలాగే తనను అవమానించేలా కామెంట్స్ చేసిన పవన్‌కు కొన్ని ప్రశ్నల్ని ఆయన సంధించారు. లేఖలోని కీలక అంశాల గురించి తెలుసుకుందాం.
“జనసేన బాగు గూర్చి ప్రత్యేకించి మీ బాగు గూర్చి నేనిచ్చే సలహాలు మీకు నచ్చినట్లు లేదు. ఈ విషయం బహిరంగసభలో నా పేరు పెట్టి మీరు అనకపోయినా ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలు చూస్తే అలానే అనిపిస్తోంది. ఎల్లో మీడియా వారి ఈ ప్రయత్నం ముఖ్యంగా మీకు నాకు మధ్య తగువులు పెడ్తున్నట్లుగా కనబడుతుంది. మిమ్మల్ని మరింత ఒంటరిగా చేస్తూ చంద్రబాబుకు మీరు మరింత దాసోహం అనిపించేటట్లు చేసేటట్లుగా చేయాలనే కృత్రిమ చర్యలా అనిపిస్తోంది”
“ఒకప్పుడు చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి అని లోకేష్ ప్రకటించినప్పుడు కాని, మిమ్మల్ని డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేయాలన్నా తెలుగుదేశం పొలిట్‌బ్యూరో ఆమోదం కావలసి వుంటుందని ఆయన తెల్పినప్పుడు గాని జన సైనికుల్లో పుట్టిన అగ్నిని మీ సమాధానం రాబట్టడం ద్వారా సదరు అగ్నిపై నీరు చల్లటానికి ప్రయత్నం చేశాను. నా యీ ప్రయత్నం మీ ఇంటరెస్ట్‌లో చేశానా లేక వైఎస్ఆర్ పార్టీ ఇంట్రెస్ట్‌లో చేశానా? “
“24 సీట్లకు అంగీకరించడంపై జనసైనికులందరు ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటే వారిని సముదాయించుటకు బహిరంగసభలో చంద్రబాబు వివరణ కోరటం కూడా వైఎస్ఆర్ పార్టీకి నేను అండ కాయటమా? వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై సి.బి.ఐ. వారు మోపిన అభియోగాలపై తొందరలో తీర్పును వెలువరింప చేయాలని కోరుతూ తెలంగాణా హైకోర్టులో నేను వేసిన వ్యాజ్యం కూడా వైఎస్ఆర్ పార్టీకి కోవర్ట్ గా పనిచేస్తూనేనా? బి.జె.పి.ని కూటమిలో చేరటానికి యిష్టపడక అడ్డంకులు సృష్టిస్తున్న చంద్రబాబును మీ బాగు కోరే బి.జె.పి. పార్టీ మీకు అండగా ఉండగలందులకు తెలుగుదేశం జనసేన కూటమిలోకి తీసుకురావాలని నేను కోరుతూ ప్రకటనలు యివ్వటం కూడా నేను వైఎస్ఆర్ పార్టీ కోవర్టుగానా?”
“మీరు జనసేన పార్టీని పెట్టి ముందుకు వస్తే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని మీ జనసేనపార్టీలో చేరి మీకు నాతో సహితంగా 80శాతంమంది కాపులు బి.సి., ఎస్.సి. వర్గాలు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ సహకారం లేకుండా తెలుగుదేశం నెగ్గటం అనేది ఇంపాజుబుల్. అది చంద్రబాబుకి తెలియంది కాదు. అందుకే మీతో జతకట్టాడు”
“వెన్నుపోటు రాజకీయాలకు అలవాటు పడిన చంద్రబాబు ఎన్నికలకు తర్వాతనైనా మీకు అధికారంలో సముచితమైన స్థానం యిస్తాడని, ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో భాగస్వామిని చేస్తాడని ఎవరు నమ్ముతారు? ఎన్నికలైన తర్వాత జనసేనను క్రమేపీ నిర్వీర్యం చేసి తన కొడుకు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తాడనే భయం జనసైనికులందరిలో ఉన్నమాట నిజం. ఎన్నికలు ముందే మీకు అధికారంలో రావటంతో పాటు, మీ స్థానం ఏమిటో తేల్చాలని జనసైనికుల తరపున నేను డిమాండు చేయటంలో తప్పేమిటి? సముచితమైన నా సలహాలను వక్రీకరిస్తూ వై.ఎస్.ఆర్. కోవర్టుగా నాకు ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్న ఈ ఎల్లో మీడియాను కాని, జనసేన పార్టీలోని కొంతమంది మీ సలహాదారులను కాని ఏమనాలి? వారు తెలుగుదేశం కోవర్టులుగా చెప్పవచ్చా”
“మిత్రులెవరో, శత్రువులెవరో తెలుసుకుని మీరు ప్రవర్తించటం, జనసేన మంచికోరి ఎంతైనా మంచిది. మీకు యిష్టమైనా, యిష్టం లేకపోయినా మీ వెంటనే ఉండి మిమ్మల్ని కాపడుకోవటం నా విధిగా భావిస్తున్నాను. నేను చచ్చేవరకు నా ప్రవర్తన ఇలాగే ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను”
ఈ లేఖ ద్వారా ఒక్క విషయాన్ని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. పవన్‌కు ఇష్టం ఉన్నా, లేకపోయినా లేఖలు రాస్తూనే వుంటారు. కూటమిలో తప్పులను ప్రస్తావిస్తూనే వుంటారు. పవన్ ఏదో అన్నాడు కదా అని జోగయ్య మాత్రం నోరు మూసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ లేఖలో చంద్రబాబు వెన్నుపోటుదారుడనే విషయాన్ని గుర్తు చేస్తూ, తస్మాత్ జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడం గమనార్హం. అలాగే జనసేనకు నష్టం కలిగించేలా టీడీపీ పొత్తులో వ్యవహరించడాన్ని ప్రశ్నిస్తుంటే, వైసీపీ కోవర్టు అంటారా? అని ఆయన ఆవేదనతో నిలదీయడాన్ని చూడొచ్చు.