టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ భారీ షాక్ ఇవ్వనుంది. బీజేపీ అడుగులన్నీ ఆ బాటలోనే పడుతున్నాయి. ఏపీలో బలపడేందుకు ఇదే సరైన సమయం అని, కనీసం 16 నుంచి 18 శాతం ఓట్లను రాబట్టుకోవచ్చని సర్వే నివేదికలు చెబుతున్నాయని బీజేపీ నేతలు తెలిపారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ, జనసేన, వైసీపీ నుంచి కనీసం 30 నుంచి 40 మంది నాయకులు తాము చేరుతామని బీజేపీ అగ్ర నాయకుల్ని కలిసినట్టు విశ్వసనీయ సమాచారం.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జ్ శివప్రకాశ్ జీ నేతృత్వంలో పొత్తుపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్, సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్‌రెడ్డి, మాధవ్‌తో పాటు మొత్తం 10 మంది కీలక నేతలు పాల్గొన్నారు.
టీడీపీ, జనసేన, వైసీపీలో టికెట్లు దక్కని నేతలు బీజేపీ వైపు క్యూ కడుతున్నారని, వాళ్లందరినీ చేర్చుకుని బలపడాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించినట్టు సమావేశంలో చర్చకు వచ్చింది. ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తదితర నేతలు బీజేపీ వైపు చూస్తున్న విషయాన్ని సమావేశంలో గుర్తు చేసుకున్నారు.
టీడీపీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకుని చంద్రబాబుకు రాజకీయంగా తామెందుకు ఊపిరి పోయాలని సమావేశంలో మెజార్టీ నేతలు అన్నారని తెలిసింది. కావున ఒంటరిగా వెళ్లడానికే బీజేపీ జాతీయ నాయకత్వం మొగ్గు చూపినట్టు ఆ పార్టీ కీలక నేతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో 2, 3వ తేదీల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఐదారుగురు ముఖ్య నాయకులు విజయవాడకు రావాలని ఆదేశించినట్టు సమాచారం. పొత్తులపై ఎవరూ మాట్లాడకూదని కూడా ఆదేశాలు ఇచ్చారని తెలిసింది. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని , ఇందులో భాగంగా చర్చించేందుకు రావాలని సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బీజేపీ నిర్ణయం కూటమికి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పక తప్పదు.