Operation Valentine Review: మూవీ రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్

చిత్రం: ఆపరేషన్ వాలెంటైన్ రేటింగ్: 2.25/5 తారాగణం: వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, రుహాని శర్మ, నవదీప్, సంపత్ రాజ్, పరేష్ పహూజా తదితరులు కెమెరా: హరి కె వేదాంతం ఎడిటింగ్‌: నవీన్ నూలి…

చిత్రం: ఆపరేషన్ వాలెంటైన్
రేటింగ్: 2.25/5
తారాగణం:
వరుణ్ తేజ్, మానుషి చిల్లర్, రుహాని శర్మ, నవదీప్, సంపత్ రాజ్, పరేష్ పహూజా తదితరులు
కెమెరా: హరి కె వేదాంతం
ఎడిటింగ్‌: నవీన్ నూలి
సంగీతం: మిక్కీ జె మేయర్
నిర్మాత: సందీప్ ముద్దా
దర్శకత్వం: శక్తిప్రతాప్ సింగ్
విడుదల తేదీ: 1 మార్చి 2024

తెలుగు తెర మీద ఎయిర్ఫోర్స్ నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలతో కూడిన బాలీవుడ్-హాలీవుడ్ స్థాయి భారీ సినిమాలు ఇప్పటివరకు లేవు. ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ చూడగానే ఆ డొమైన్ లోకి తెలుగు సినిమా కూడా వెళ్లిందన్న గర్వం కలుగుతుంది. ఇంతకీ విషయమెలా ఉందో చూద్దాం. 

కథలోకి వెళ్తే అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) భారతీయ వైమానిక దళంలో వింగ్ కమాండర్. అతని భార్య అహానా గిల్ (మానుషి చిల్లర్) రాడార్ విభాగంలో పని చేసే మరొక ఆఫీసర్. అర్జున్ “ఆపరేషన్ వజ్ర” అని ఒక యుద్ధవ్యూహానికి నాయకత్వం వహిస్తాడు. అదేంటంటే శత్రువుల రాడార్లకి అందకుండా భూమికి అతి సమీపంలో విమానాల్ని ఎగరేసే ప్రక్రియ. అయితే తొలి ప్రయత్నంలోనే మరొక ఆఫీసర్ అయిన తన స్నేహితుడు (నవదీప్) ని కోల్పోతాడు అర్జున్. దాంతో ఆపరేషన్ వజ్ర పై బ్యాన్ విధిస్తుంది భారత్. అర్జున్ దేవ్ గాయాల నుంచి కోలుకుని కొన్నాళ్లకి ఆపరేషన్ వాలెంటైన్ కోసం డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఆ ఆపరేషన్ ఏమిటి? చివరికి ఏమౌతుందనేది కథ.

కథగా చూసుకుంటే వ్యక్తిగత భావోద్వేగాలు, భార్యాభర్తల మధ్య సంఘర్షణ, దేశభక్తి, యుద్ధం.. ఇలా మంచి సినిమాకి కావాల్సిన దినుసులన్నీ ఉన్నట్టే కనిపిస్తాయి. 

కానీ అవన్నీ సమపాళ్లల్లో సరైన విధంగా సమ్మేళనం చేసినప్పుడే మంచి డ్రామా పండించడం కుదురుతుంది. 

ఇక్కడ 'ది బెస్ట్' అనుకోగలిగే సన్నివేశాలు ఎయిర్ స్ట్రైక్స్ కి సంబంధించినవే. చాలా గ్రాండ్ గా తీసారు. అయితే ఏ సినిమాకైనా కంటికి కనిపించే గ్రాండ్నెస్ ఒక్కటీ మనసుల్ని తాకడానికి సరిపోదు. ఎంచుకున్న పాత్రల మధ్యన ఎమోషన్ పండాలి. అది సరైన డైలాగ్, బలమైన సంఘటనల ద్వారానే సాధ్యమౌతుంది. ఇక్కడ సంభాషణల రచన చాలా పేలవంగా ఉంది. పర్సనల్ ఎమోషన్స్ కావొచ్చు, దేశభక్తికి చెందిన భావోద్వేగం కావొచ్చు మాటలద్వారా అస్సలు పండలేదు. 

దానికి తోడు పరేష్ పహూజా ట్రాక్ తీసినవాళ్లకి కామెడీ అనిపించినా చూసినవాళ్లకి మాత్రం సహనపారీక్షే.

నవదీప్ పాత్ర చాలా చిన్నది.. గెస్ట్ రోల్ అనుకోవచ్చు.

చాలా పాత్రలకి సరైన క్యారక్టర్ ఆర్క్ రాసుకోలేదు. రుహానీ శర్మ పాత్ర ఎంత బిల్డప్ తో ఎంటరవుతుందో అంత వాడబడలేదు. సంపత్ రాజ్ క్యారెక్టర్ కూడా అంతే. 

వరుణ్ తేజ్ మాత్రం వింగ్ కమాండర్ పాత్రలో నిండుగా ఉన్నాడు. అతని పర్సనాలిటీ, లుక్స్, బాడీ లేంగ్వేజ్ అన్నీ 'ది బెస్ట్' అన్నట్టుగా ఉన్నాయి ఈ క్యారెక్టర్ కి. 

మానుషి చిల్లర్ ఓకే. నెగటివ్ గా చెప్పడానికి ఏదీ లేదు.. అలాగని పాజిటివ్ గా చెప్పుకునేందుకు కూడా పెద్దగా ఏమీ లేదు. 

ప్రధమార్ధంలో చాలా సేపు హీరోహీరోయిన్స్ మధ్యన జరుగుతున్న కథ మనసుకి హత్తుకోక డల్ గా అనిపిస్తుంది. నెమ్మదిగా ఇంటర్వల్ ముందు నుంచి కథనం ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. మళ్లీ సెకండాఫ్ లో పడుతూ లేస్తూ సాగుతుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ పద్ధతిలో సాగే స్క్రీన్ ప్లే మాత్రం ఈ కథకి అనవసరమనిపిస్తుంది. 

మిక్కీ జె మేయర్ మ్యూజిక్ పర్వాలేదనిపించేలా ఉంది. పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం ఓకే. కానీ ఈ తరహా చిత్రాలకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. సామాన్య ప్రేక్షకులు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని గుర్తించి ఆస్వాదిస్తున్న రోజులివి. 

ఇక ఈ చిత్రానికి హైలైట్స్ కెమెరా వర్క్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ కొరియోగ్రఫీ. అన్నీ టాప్ క్లాస్ లో ఉన్నాయి. 

ఉన్న లోపమల్లా ప్రధానంగా కథనం, రచనలే. అవసరమైన ఎమోషన్, కావాల్సినంత దేశభక్తి మనసుకి అందక కంటికి ఎంత గొప్పగా కనిపించినా గొప్ప సినిమా అనడానికి లేకుండా పోయింది. 

ఈ మధ్యనే వచ్చిన బాలీవుడ్ చిత్రం “ఫైటర్” కూడా విఫలమయింది ఈ కారణాల వల్లే. అది కూడా పూర్తిగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో తీసిన చిత్రమే. యాంబియన్స్, ఆఫీసర్స్ మధ్యలో స్నేహం, బాడీ లాంగ్వేజ్ ల పై దృష్టి ఎక్కువ పెట్టి అసలు కథలోని ఎమోషన్ ని పండించలేకపోవడం ఫైటర్ ఫెయిల్యూర్ కి కారణమయింది. ఈ “ఆపరేషన్ వాలెంటైన్” కూడా ఆ దిశగా వెళ్లేలా ఉంది. 

ఆశించిన వినోదం, దేశభక్తి తాలూకు ఉద్వేగం.. రెండూ అందకపోవడం వల్ల ఈ ఆపరేషన్ ఫెయిల్ అనే చెప్పాలి.

బాటం లైన్: ఆ”పరేషాన్”