ఎన్నికల్లో ప్రతి సీటూ గెలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. వివిధ సర్వే నివేదికలను దగ్గర పెట్టుకుని, అనేక వడపోతల అనంతరం అభ్యర్థులను జగన్ ఎంపిక చేస్తున్నారు. టికెట్లు దక్కని ఇతర పార్టీలకు చెందిన ప్రజాదరణ ఉన్న నాయకులపై వైసీపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.
ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి మరోసారి వైసీపీ నుంచి బరిలో దిగనున్నారు. టీడీపీ తరపున భూమా అఖిలప్రియ పోటీ చేయనున్నారు. భూమా శోభా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో అఖిలప్రియ రాజకీయాల్లోకి వచ్చారు. తల్లి మరణంతో ఆళ్లగడ్డ నుంచి ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికయ్యే నాటికి ఆమె వైసీపీ. అయితే భూమా నాగిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో, తండ్రి బాటలోనే అఖిలప్రియ కూడా నడిచారు. చిన్న వయసులోనే ఆమె మంత్రి కూడా అయ్యారు. ఇదే ఆమె పాలిట శాపమైంది. చిన్న వయసులో పెద్ద పదవులు వరించడంతో చిన్నాపెద్దా, తనమన అనేది లేకుండా పోయింది. అందరినీ ఆమె దూరం చేసుకున్నారు.
2019 ఎన్నికల్లో ఫ్యాన్ గాలిలో 35 వేల పైచిలుకు మెజార్టీతో అఖిలపై బ్రిజేంద్ర గెలుపొందారు. రానున్న ఎన్నికలు అఖిల పొలిటికల్ లైఫ్‌కు సవాల్. ఈ సారి ఓడితే ఇక ఆమె రాజకీయ జీవితం ముగిసినట్టే. దీంతో ఈ ఎన్నికల్లో ఆమెను ఓడించాలని వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆళ్లగడ్డ నుంచి బీజేపీ తరపున పొత్తులో భాగంగా అఖిలప్రియ పెదనాన్న కుమారుడు భూమా కిషోర్‌రెడ్డి పోటీ చేయాలని అనుకున్నారు. నాలుగేళ్లుగా ఆయన నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు. ప్రజల్లో పలుకుబడి పెంచుకున్నారు. బీజేపీ కాకుండా ప్రధాన పార్టీ టికెట్ వస్తే చాలు గెలుస్తాడు అనే విధంగా పేరు తెచ్చుకున్నారాయన.
అయితే అఖిలప్రియకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆయన వ్యూహం మార్చారు. ఆళ్లగడ్డలో భూమా కిషోర్‌రెడ్డి మద్దతు వుంటే మరోసారి 2019 నాటి మెజార్టీ వస్తుందని వైసీపీ అధిష్టానం అంచనా వేసింది. ఈ క్రమంలో భూమా కిషోర్‌రెడ్డితో వైసీపీ అధిష్టానం పెద్దలు చర్చలు మొదలు పెట్టినట్టు తెలిసింది. రెండు రోజుల క్రితం విజయవాడలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర పెద్దలు ఆయనతో చర్చించినట్టు సమాచారం.
వైసీపీలో చేరి, బ్రిజేంద్ర గెలుపునకు కృషి చేయాలని, రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ లేదా దానికి సమాన స్థాయి పదవి ఇస్తామని కిషోర్‌రెడ్డికి హామీ ఇచ్చినట్టు తెలిసింది. అదే విధంగా 2029లో రాబోవు నియోజక పునర్విభజనలో భాగంగా ఏర్పడే కొత్త అసెంబ్లీ స్థానం నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం
తన భర్త భార్గవ్‌రామ్‌తో కలిసి ఆళ్లగడ్డను భయబ్రాంతులకు గురి చేస్తున్న అఖిలప్రియ ఓటమే ఏకైక లక్ష్యంగా భూమా కిషోర్‌రెడ్డి రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. వైసీపీలో కిషోర్‌రెడ్డి చేరికతో భారీ మెజార్టీ వస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. వైసీపీలో కిషోర్‌రెడ్డి చేరడమే తరువాయి, ఎన్నికలతో సంబంధం లేకుండా ఆ నియోజకవర్గాన్ని అధికార పార్టీ ఖాతాలో వేయొచ్చనేది స్థానికుల అభిప్రాయం.