వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటమి కోరుకునే ప్రముఖుల జాబితా చేంతాడంత. వీరిలో జగన్ కుటుంబ సభ్యులుండడం చర్చనీయాంశమైంది. జగనన్న ఓటమే లక్ష్యమంటూ ఆయన చెల్లి వైఎస్ షర్మిల ఇప్పటికే ఊరూరా తిరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిల చేతిలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి వుంది. దీన్ని అడ్డం పెట్టుకుని… షర్మిల నోటికొచ్చినట్టు విమర్శిస్తున్నారు. ఎవరైనా తనను విమర్శిస్తే మాత్రం… ఆడబిడ్డననే విచక్షణ కూడా లేకుండా వైసీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారని షర్మిల సానుభూతి పొందేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు.
తాజాగా జగన్‌ను ఓడించాలని ఢిల్లీ వేదికగా మరో చెల్లి డాక్టర్ సునీత పిలుపునివ్వడం గమనార్హం. ఢిల్లీలో సునీత మీడియా సమావేశం నిర్వహించడం వెనుక దురుద్దేశం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వెనుక ఎవరున్నారో అందరికీ మరోసారి తెలిసిపోయింది. చంద్రబాబు, రఘురామకృష్ణంరాజు, పవన్‌కల్యాణ్‌లకు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా, తాను ఎవరి కోసం ఇదంతా చేస్తున్నారో చెప్పకనే చెప్పారు.
తన సోదరుడు జగన్, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని సునీత కోరారు. వైసీపీకి కాకపోతే, ప్రత్యామ్నాయ పార్టీ అయిన టీడీపీ లేదా జనసేనకు ఓట్లు వేయాలని ఆమె పరోక్షంగా పిలుపునిచ్చారు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు , అలాగే న్యాయ స్థానాల్లో విచారణ జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన అన్నను బద్నాం చేయడానికే సునీత ముందుకొచ్చారని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదంతా తనకు ఆర్థికంగా అండగా నిలిచిన ఎల్లో బ్యాచ్ రుణం తీర్చుకోడానికి సునీత చేస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. రాజకీయాల్లోకి సునీత రావాలనుకుంటే, ఎవరికీ అభ్యంతరం వుండాల్సిన అవసరం లేదు. వివేకా హత్య కేసు విచారణలో ప్రజల సహకారం కోరడం ఏంటో ఆమెకే తెలియాలి. ఏపీ ప్రజల మద్దతు, తీర్పు తనకు అవసరమని ఆమె అన్నారు. వివేకా హత్య కేసు సాకుతో జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని సునీత కొత్త నాటకానికి తెరలేపితే, జనం తెలుసుకోలేని అమాయకులేం కాదు.
షర్మిల, డాక్టర్ సునీత ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నారో ఇప్పటికే ప్రజానీకం గుర్తించారు. అందుకే షర్మిలను జనం పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు తన తండ్రి హత్యను రాజకీయంగా ప్రత్యర్థులకు అస్త్రంగా ఇవ్వాలనే తలంపుతో సునీత ముందుకొచ్చినట్టు కనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీలో 700 మంది కుటుంబ సభ్యుల్లో కేవలం షర్మిల ఒక్కరే తనకు అండగా నిలిచారని సునీత వాపోయారు. కుటుంబ సభ్యులే అండగా నిలవకపోతే, ఇక ఎవరో వచ్చి మద్దతు ఇస్తారని ఎలా అనుకుంటున్నారో సునీతకే తెలియాలి. తండ్రిని పోగొట్టుకున్న సునీత, ఇలా ఇతరుల రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలాడితే, ఉన్న కొద్దోగొప్పో సానుభూతి కూడా పోతుందని తెలుసుకుంటే మంచిది.