రాడిసన్ డ్రగ్స్ కేసు రోజురోజుకు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. ఊహించని విధంగా ఈ కేసులో దర్శకుడు క్రిష్ పేరు ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో 10వ నిందితుడిగా క్రిష్ పేరు ఉంది. దీనికి సంబంధించి విచారణకు హాజరవుతానని పోలీసులకు తెలిపిన క్రిష్, తాజాగా ఝలక్ ఇచ్చాడు. కేసుపై హైకోర్టును ఆశ్రయించాడు.
డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని క్రిష్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. వివేకానంద చెప్పిన మాటల ఆధారంగానే తనను నిందితుడిగా మార్చారని, తన పిటిషన్ లో ఆరోపించాడు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న తనను కావాలనే కేసులో ఇరికించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశాడు.
క్రిష్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు స్పందించింది. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుపై పూర్తి వివరాలు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. తమ ఆదేశాలు లేకుండా క్రిష్ పై ఎలాంటి చర్యలకు దిగొద్దని సూచించింది.
ఇంకా పరారీలో నిందితులు.. మరోవైపు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న లిషి గణేశ్ పరారీలో ఉంది. ఆమె ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. లిషి ఎక్కడుందో తమకు తెలియదని అంటున్నారు ఆమె కుటుంబ సభ్యులు. మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న టాలీవుడ్ నిర్మాత కొడుకు నీల్ కూడా కనిపించడం లేదు. అతడికి అమెరికా పౌరసత్వం ఉంది. బహుశా, యూఎస్ పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. క్రిష్ కూడా ఎక్కడున్నాడో తమకు తెలియలేదని, అతడి ఆచూకి ఇంకా లభ్యం కాలేదని పోలీసులు చెప్పడం విశేషం.