ఇంకా ఎవరు మిగిలారు చంద్రబాబూ?

ఇంటి ఆడపడుచులు రోడ్డు ఎక్కారు. రాష్ట్రంలోని ఆర్థికంగా, మీడియా పరంగా, వ్యాపార పరంగా బలమైన ఓ వర్గం ఎన్ని విధాల పోరు సాగించాలో అన్ని విధాలా సాగిస్తోంది. ఏ మాత్రం అవకాశం వన్నా కోర్టుల…

ఇంటి ఆడపడుచులు రోడ్డు ఎక్కారు. రాష్ట్రంలోని ఆర్థికంగా, మీడియా పరంగా, వ్యాపార పరంగా బలమైన ఓ వర్గం ఎన్ని విధాల పోరు సాగించాలో అన్ని విధాలా సాగిస్తోంది. ఏ మాత్రం అవకాశం వన్నా కోర్టుల ద్వారా ఎలా అడ్డుకోవాలో అలా అడ్డుకుంటున్నారు. అభివృద్ది మొత్తం అక్షరాల మాటున దాటేసి, నెగిటివ్ పాయింట్లు మాత్రమే నిత్యం బాకా ఊదుతున్నారు. మేధావుల అనే వారిని మెల్లగా తమ వైపు లాక్కో గలిగారు.

పార్టీ ఏదైనా వాటి అధ్యక్షులంతా యాంటీ జగన్ జపం చేస్తున్నారు. తన లక్ష్యం కేవలం జగన్ ను గద్దె దించడం తప్ప వేరు కాదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. నిరుద్యోగులను, చిరుద్యోగులను, ఉద్యోగులను ఉసిగొల్పుతూనేే వున్నారు.

ర‌ఘ‌రామ కృష్ణంరాజు అయిదేళ్ల పాటు సిగ్గు విడిచి వైకాపా తరపున పార్లమెంట్ సభ్యత్వం వదలకుండా అనుభవిస్తూనే, అధినేతను నిత్యం దుయ్యబడుతూ వచ్చారు. ఆ విధంగా ఓ సామాజిక వర్గాన్ని జగన్ కు దూరం చేసే ప్రయత్నం చేసారు. అంటే మొత్తం మీద కమ్మ.. కాపు.. క్షత్రియ వర్గాలు దాదాపుగా కొంత వరకు జగన్ కు దూరం చేయగలిగారు. 

ఇక మిగిలింది ఎవరు? రెడ్లలో కూడా జగన్ కు పూర్తిశాతం ఓట్లు దక్కకూడదని అప్ప చెల్లెళ్లు సునీతను, షర్మిలను రంగంలోకి దింపారు. అనేకానేక అభూత కల్పనలు నిత్యం ప్రచారం చేసి హిందువులను సైతం జగన్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తూనే వున్నారు. ఎస్సీ వర్గంలో జగన్ కు బలం వుందన్న భయంతో, ఆ వర్గం కాస్త క్రేజ్ వున్నవారిని తెచ్చి ముందు పెట్టుకుంటున్నారు.

ఇక మిగిలింది ఎవరు?

ఇంతలా, ఇన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా జగన్ అంటే భయం పడుతూనే వున్నారు. ఇంకా ఎవరు మిగిలిపోయారు అని వెదుకుతూనే వున్నారు.

ఎందుకిలా?

ఇన్ని వర్గాలు దూరం అయ్యేలా చేసామని సంబరపడుతూనే, ఇన్ని వర్గాలను దూరం చేసే ప్రయత్నం అవిశ్రాంతంగా చేస్తూనే, నిత్యం నిజం పది పైసలు అయితే, అబద్ధం అర్ధరూపాయి కలిపి ప్రచారం సాగిస్తూనే వున్నారు. అయినా కూడా జగన్ అపజయం ఖాయం అన్న నమ్మకం నూటికి నూరుశాతం చంద్రబాబు అండ్ కో కు కలగడం లేదు. ఇంకా ఎక్కడో భయం పీకుతోంది.

జగన్ నుంచి పథకాలు అందుకున్నవారు ఏం చేస్తారో అన్న అనుమానం.

జగన్ వాడుతున్న ఎన్నికల వ్యూహాలు ఎక్కడ తమకు చికాకు పెడతాయో అన్న సందేహం.

జగన్ పెట్టే డబ్బు ఖర్చును తాము తట్టుకోలేమో అన్న భయం.

సభలకు జనం ఎలా వస్తున్నారో అన్నది దాచి పెట్టి ఎల్లో మీడియా ఎక్కడ లేని భజన చేస్తున్నా, వాళ్లని ఎంత ఖర్చు పెట్టి, ఎలా తీసుకువస్తున్నామన్నది చంద్రబాబుకు తెలుసు. అందువల్ల సభలకు వస్తున్న జనాన్ని నమ్మలేకపోతున్నారు. అలాగే సర్వేలు ఎలా వుంటాయి. వాటి ముందు వెనుకలు ఏమిటన్నది బాగా తెలుసు కనుక వాటినీ నమ్మలేకపోతున్నారు.

జరుగుతున్న హడావుడి అంతా జనసేనతో కలవడం వల్ల తప్ప వేరు కాదు అన్నది చంద్రబాబుకు తెలుసు. జనం తనను ఇంకా తనను నమ్ముతున్నారో లేదో అన్న అనుమానం పీడిస్తూనే వుంది. అందుకే జగన్ ను కట్టడి చేయడానికి తాము చేస్తున్నది సరిపోతుందా కలుగుతూనే వుంది. అందుకే దెబ్బ మీద దెబ్బ పడేస్తూ వుండాలనే తపనలో చంద్రబాబు వున్నట్లు కనిపిస్తోంది.

ఇక ఏం చేసినా ఈ రెండు నెలల్లో చేసేయాల్సిందే అన్న తపనలో జగన్ వైరి పక్షాలు వున్నట్లు కనిపిస్తోంది. అందుకే రోజూ ఏదో ఒకటి చేయాలి. జగన్ ను జనం మధ్య కార్నర్ చేయాలి. పాతవో, కొత్తవో అభూతకల్పనలు అల్లే పని ఎల్లో మీడియా ఎలాగూ చేస్తుంది. కానీ దానికి కాస్త ఊతం ఇవ్వాలి. సోషల్ మీడియా జనాల చేతికి ఫుల్ పని వుండాలి అంటే ఎవరో ఒకరి చేత ఏదో ఒకటి అనిపించాలి. ఇలా రకరకలాలుగా ప్రయత్నాలు సాగిస్తూనే వున్నారు.

కానీ ఇక్కడ జగన్ కు ఒకటే రిలీఫ్ ఏమిటంటే.. అనాల్సిన వాళ్లు, చేయాల్సిన వాళ్లు, చెప్పాల్సిన వాళ్లు అంతా దాదాపుగా ఎన్నికల అనౌన్స్ మెంట్ కు ముందుగానే బయటకు వచ్చేస్తున్నారు. పాఠాలు అప్పగించేస్తున్నారు. ఇక మళ్లీ పదే పదే ఇదే చెప్పాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది. ఆయన తాను పదవిలోకి వస్తే ఏం చేస్తాను అన్నది చెప్పడం లేదు. జగన్ ను గద్దె దింపడమే తన లక్ష్యం అని పదే పదే చెబుతున్నారు.

ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి ఈ టాపిక్ లు అన్నీ బోర్ కొట్టేస్తాయి. ఎన్నికల మేనిఫెస్టోనే కీలకం. జగన్ ఏమన్నా కొత్తగా వరాలు ప్రకటిస్తారా? చంద్రబాబు ఇప్పుడు వల్లె వేస్తున్న వరాలేనా? మరేమైనా చెబుతారా?  ఇవన్నీ కీలకంగా వుండబోతున్నాయి. అక్కడే జగన్ ఎడ్జ్ తీసుకునే అవకాశం వుంది. ఎందుకంటే జగన్ మాట ఇస్తే నమ్ముతారు అనే నమ్మకం జనాల్లో వుంది. అదే నమ్మకాన్ని తెచ్చుకునే పని చంద్రబాబు చేయడం లేదు.

చంద్రబాబు తనను తాను నమ్ముకోవడం లేదు. ఎవరెవరినో నమ్ముకుని, రంగంలోకి దించి జగన్ ను టార్గెట్ చేయిస్తున్నారు. ఎందుకంటే తను టార్గెట్ చేసినా జనం నమ్మడం లేదని చంద్రబాబుకు ఓ అభిప్రాయం స్థిరపడిపోయింది. అందుకే ఇంకేం చేయాలి.. ఇంకేం చేయాలి అన్న ఆలోచనతోనే ముందుకు సాగుతుంది.

అయినా ఇంకా జగన్ ను కార్నర్ చేయడానికి చంద్రబాబు దగ్గర ఏం అస్త్రం మిగిలింది?