తెలంగాణ మంత్రి హరీష్‌రావు బాధేంటో తెలియదు కానీ, అప్పుడప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని గిల్లుకుంటుంటారు. ఇటీవల ఏపీ ప్రభుత్వంపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లపై కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపణలు చేశారు. హరీష్‌కు ఏపీ మంత్రుల వైపు నుంచి దీటైన కౌంటర్ వెళ్లింది. హరీష్‌రావు అనవసరంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పెట్టుకున్నారని అసంతృప్తి టీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది.
హరీష్‌రావు విమర్శలు మునుగోడు ఉప ఎన్నికపై తప్పక ప్రభావం చూపుతుందనే ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కేసీఆర్, జగన్ పరస్పరం విమర్శించుకున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో జగన్‌పై హరీష్‌రావు ఎందుకు నోరు పారేసుకున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులెవరూ టీఆర్ఎస్‌కు ఓటు వేసేందుకు ఇష్టపడరనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ ప్రభుత్వంపై హరీష్ విమర్శల నేపథ్యంలో టీఆర్ఎస్‌పై వైఎస్సార్ అభిమానుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి దివంగత వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితం కావడం జాతీయపార్టీకి కలిసొస్తుందని చెబుతున్నారు. మునుగోడులో ప్రధానంగా పోటీ బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే జరగనుంది. దీంతో వైఎస్సార్ అభిమానులు కాంగ్రెస్‌ను కాకుండా టీఆర్ఎస్‌ను ఓడించే పార్టీ వైపే మొగ్గు చూపుతారనే అభిప్రాయాల్ని కొట్టి పారేయలేం.
మునుగోడు ఉప ఎన్నికకు నెల రోజులు మాత్రమే గడువు వుంది. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాల్సిన తరుణంలో హరీష్‌రావు ఎందుకు నోరు జారారనేది చర్చనీయాంశమైంది. మునుగోడులో రెడ్డి సామాజిక వర్గంతో పాటు వైఎస్ అభిమానులు చెప్పుకోతగ్గ స్థాయిలోనే వున్నారు. హరీష్‌రావు నోటి దురుసు పుణ్యమా అని వారంతా బీజేపీ వైపు చూడడం ద్వారా టీఆర్ఎస్‌కు నష్టమే అని చెప్పొచ్చు.