తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుందన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించడానికే కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
ప్రజల ఇబ్బందులు, కష్టాలు, తన వైఫల్యాల నుంచి చర్చ మళ్లించి , జాతీయ పార్టీపైన మొదలు పెట్టాలనే వ్యూహంలో భాగంగానే కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో జాతీయ పార్టీపైన తప్ప, కేసీఆర్ వైఫల్యాల మీద, కేసీఆర్ అక్రమాల మీద, కల్వకుంట్ల కుటుంబ అహంకారం మీద చర్చ జరగకూడదనే దుర్మార్గ ఆలోచనతో జాతీయ పార్టీ అని కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని విరుచుకుపడ్డారు.
దేశంలో మజ్లిస్ పార్టీని పెంచి పోషించేందుకే జాతీయ పార్టీ పెడతానని కేసీఆర్ ప్రకటిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను కలవడానికి జాతీయ స్థాయిలో ఏ నాయకుడు సిద్ధంగా లేరన్నారు. ప్రధాని అయినట్టు కేసీఆర్ కలలు కంటున్నారని తప్పు పట్టారు. తెలంగాణలో కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందన్నారు. అందుకే దేశంలోని ఇతర ప్రాంతాల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కూచున్న భూమే బద్ధలవుతుంతే, ఆయన మాత్రం ఆకాశాన్ని అందుకుంటానని ప్రకటిస్తున్నారని విమర్శించారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల్లారా ముందు తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. తర్వాత దేశం సంగతి దేవుడెరుగు అని ఆయన సెటైర్ విసిరారు. తెలంగాణలోని అన్ని వర్గాలు టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు నిద్రలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ కనిపిస్తున్నాయని కిషన్‌రెడ్డి వెటకరించారు.