రాజకీయం తెలంగాణ కేంద్రంగా పరిభ్రమిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక, టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి) అనే జాతీయ పార్టీ ఆవిర్భావం తదితర కీలక ఘట్టాలన్నీ ఆ రాష్ట్రంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 5న దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదే సందర్భంలో మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ వచ్చింది. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కనుంది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను వాయిదా వేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే పోటీ మాత్రం టీఆర్ఎస్, బీజేపీ మధ్య భీకరంగా వుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బహుశా తెలంగాణలో ఇదే చివరి ఉప ఎన్నిక కావచ్చు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేదిగా ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో బీజేపీ వుంది. అందుకే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని, ఆయనతో రాజీనామా చేయించి, వ్యూహాత్మకంగా ఉప ఎన్నిక వచ్చేలా బీజేపీ చేసింది.
దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలుపును స్ఫూర్తిగా తీసుకుని మునుగోడులో టీఆర్ఎస్ను మట్టి కరిపించాలని బీజేపీ తహతహలాడుతోంది. మునుగోడులో విజయం సాధించి తెలంగాణలో అధికారం తమదే అనే సంకేతాల్ని ఇవ్వాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మరోవైపు టీఆర్ఎస్ గెలిచి తన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకమని చెప్పడం.
కేసీఆర్ జాతీయ పార్టీ కలలు కంటున్న తరుణంలో ఆదిలోనే దెబ్బ కొట్టాలని బీజేపీ మునుగోడు ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక, కేసీఆర్ జాతీయ పార్టీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ కూడా ఆసక్తిగా చూస్తోంది.