జ‌గ‌న్ బ‌ర్త్‌డే ట్రెండింగ్‌…ఆమె విషెస్‌ మిస్‌!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 50వ సంవ‌త్స‌రంలో అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం క్యాంప్ కార్యాల‌యంలో జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లను ఘ‌నంగా  నిర్వ‌హించారు. త‌ల్లి విజ‌య‌లక్ష్మి, పెద్ద‌మ్మ వైఎస్ భార‌తి, భార్య భార‌తి,…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి 50వ సంవ‌త్స‌రంలో అడుగు పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం క్యాంప్ కార్యాల‌యంలో జ‌గ‌న్ పుట్టిన రోజు వేడుక‌లను ఘ‌నంగా  నిర్వ‌హించారు. త‌ల్లి విజ‌య‌లక్ష్మి, పెద్ద‌మ్మ వైఎస్ భార‌తి, భార్య భార‌తి, చిన్న‌మ్మ స్వ‌ర్ణ‌ల‌త‌, చిన్నాన్న‌, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఉన్న‌తాధికారులు త‌దిత‌రుల నేతృత్వంలో కేక్ క‌ట్ చేసి సంబ‌రాలు జ‌రుపుకున్నారు. వీరితో పాటు సోద‌రి వైఎస్ ష‌ర్మిల అక్క‌డ లేక‌పోవ‌డం కొర‌తే.

ఇదిలా వుండ‌గా జ‌గ‌న్ బ‌ర్త్ డేని పుర‌స్క‌రించుకుని ఆయ‌న‌కు దేశ‌, విదేశాల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.  #HBDYSJagan అనే హ్యాష్‌ ట్యాగ్‌తో అభిమానులు భారీగా ట్వీట్లు చేస్తున్నారు. జ‌గ‌న్‌కు విషెస్ చెబుతూ 4 లక్షలకు పైగా ట్వీట్లు వ‌చ్చాయ‌ని వైసీపీ సోష‌ల్ మీడియా చెబుతోంది. ట్విట‌ర్‌లో ఇండియాలో టాప్ ట్రెండింగ్‌లో జ‌గ‌న్ బ‌ర్త్ డే ఉన్న‌ట్టు చెబుతున్నారు. జ‌గ‌న్‌పై నెటిజ‌న్ల ఆద‌ర‌ణ ఏ రేంజ్‌లో వుందో అర్థం చేసుకోవ‌చ్చు.

కానీ ఒకే ఒక్క వ్య‌క్తి జ‌గ‌న్‌కు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌క‌పోవ‌డం భారీ లోట‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ వ్య‌క్తి మ‌రెవ‌రో కాదు… జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల‌. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ త‌న‌ను అన్న వ‌దిలిన బాణంగా చెప్పుకున్న ముద్దుల చెల్లి. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో వైఎస్సార్‌టీపీ అధినేత్రిగా కొత్త రాజ‌కీయ పార్టీని స్థాపించి… సుదీర్ఘ పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మోదీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు త‌దిత‌రులు ట్విట‌ర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు.

అయితే ష‌ర్మిల మాత్రం అన్న‌ను అస‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నెల 17న ష‌ర్మిల పుట్టిన రోజు. ఆ రోజు ష‌ర్మిల‌కు జ‌గ‌న్ బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌క‌పోవ‌డాన్ని ఆమె అనుచ‌రులు గుర్తు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.  మంత్రి రోజా త‌దిత‌ర వైసీపీ నేత‌లు ష‌ర్మిల‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల‌తో దిగిన ఫొటోల‌ను షేర్ చేసుకున్నారు.

అన్న త‌న‌కు విషెస్ చెప్ప‌క‌పోవ‌డాన్ని గుర్తు పెట్టుకోవ‌డం వ‌ల్లే… నేడు ఆమె కూడా అదే రీతిలో వ్య‌వ‌హ‌రించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ ఇంటికి ష‌ర్మిల ఇల్లు ఎంత దూర‌మో, ఆమె ఇంటికి కూడా ఆయ‌న ఇల్లు అంతే దూర‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.