అవినాష్ బెయిల్‌పై హైకోర్టు ప్ర‌శ్న‌లు….సీబీఐ ఉక్కిరిబిక్కిరి!

దివంగ‌త మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు వేసిన ప్ర‌శ్న‌ల‌కు సీబీఐ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై తెలంగాణ…

దివంగ‌త మాజీ మంత్రి వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఇవాళ తెలంగాణ హైకోర్టు వేసిన ప్ర‌శ్న‌ల‌కు సీబీఐ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఈ కేసులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టు వెకేష‌న్ బెంచ్ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎం.ల‌క్ష్మ‌ణ్ విచారిస్తున్నారు. ఇప్ప‌టికే అవినాష్‌, డాక్ట‌ర్ సునీత త‌ర‌పు వాద‌న‌ల‌ను న్యాయ‌మూర్తి విన్నారు. రెండో రోజైన శ‌నివారం సీబీఐ త‌ర‌పు వాద‌న‌లు జ‌రుగుతున్నాయి.

ఈ సంద‌ర్భంగా సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాదిని వెకేష‌న్ బెంచ్ న్యాయ‌మూర్తి కొన్ని కీల‌క ప్ర‌శ్న‌లు వేశారు. వీటికి స‌మాధానం చెప్పేందుకు సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాది ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. సాక్ష్యాలు చెరిపేసేందుకు అవినాష్‌రెడ్డి ర‌క్త‌పు మ‌ర‌క‌ల్ని తుడిపేసిన‌ట్టు చెబుతున్నార‌ని, మ‌రి వివేకా ఒంటిపై గాయాలున్నాయి క‌దా, అవి కీల‌క ఆధారాలు కావా? అని జ‌డ్జి ప్ర‌శ్నించారు.

అలాగే వివేకానంద‌రెడ్డి ఎవ‌రి కోసం ప్ర‌చారం చేశార‌ని ప్ర‌శ్నించారు. అస‌లు ఈ కేసులో వివేకా హ‌త్య‌కు ఉద్దేశం ఏంట‌ని సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాదిని జ‌డ్జి ప్ర‌శ్న‌ల‌తో ముంచెత్తారు. వీటికి స‌రైన స‌మాధానాలు చెప్పేందుకు సీబీఐ న్యాయ‌వాది త‌డ‌బ‌డాల్సి వ‌చ్చింద‌ని అంటున్నారు. మ‌రికొన్ని కీల‌క ప్ర‌శ్న‌ల్ని సీబీఐకి హైకోర్టు సంధించ‌డాన్ని చూడొచ్చు.

“ఎ-2 నిందితుడు అవినాష్‌ ఇంట్లో ఉన్నారని ఎలా చెబుతున్నారు? ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమైంది? లోక్‌సభ అభ్యర్థి కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు?. లోక్‌సభ అభ్యర్ధిగా అవినాష్‌ను ముందే ప్రకటించారని మీ చార్జ్‌షీట్‌లో చాలామంది స్టేట్‌మెంట్‌లు ఇచ్చిన‌ట్టు ఉన్నాయి కదా? అవినాష్‌ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్‌మెంట్లు ఉన్నాయి కదా? వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్‌కు ఏముంది” అని సీబీఐ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది

వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, ఉద‌య్‌కుమార్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ల నుంచి ఏమైనా స‌మాచారం రాబ‌ట్టారా? అని హైకోర్టు నిల‌దీసింది. వాళ్లు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని కోర్టు దృష్టికి సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాది తీసుకెళ్లారు. అవినాష్‌రెడ్డి కూడా విచార‌ణ‌కు స‌హ‌కరించ‌డం లేద‌ని తెలిపారు. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఏదో ఒక‌సాకుతో త‌ప్పించుకుంటున్న‌ట్టు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. వివేకా హ‌త్య‌కు నెల రోజుల ముందే కుట్ర జ‌రిగింద‌ని, రాజ‌కీయ కారణంగానే హ‌త్య జ‌రిగింద‌ని సీబీఐ గ‌ట్టిగా వాదించ‌డం గ‌మ‌నార్హం. 

అవినాష్‌రెడ్డి కోరిన‌ట్టు ద‌ర్యాప్తు చేయ‌డం త‌మ ప‌నికాద‌ని సీబీఐ పేర్కొంది. ఇదే సంద‌ర్భంలో సీబీఐ కోరుకున్న‌ట్టు స‌మాధానాలు చెప్ప‌డం అవినాష్‌రెడ్డి ప‌నికాద‌ని వైసీపీ నేత‌లు వాదిస్తున్నారు. ముంద‌స్తు బెయిల్‌పై ఇవాళ్టి విచార‌ణ మాత్రం కొన్ని కీల‌క ప్ర‌శ్న‌ల‌ను రేకెత్తించింది.