టీడీపీ 160 సీట్లు గెలిస్తే….మ‌రి ప‌వ‌నో?

మ‌హానాడు వేదిక‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు టీడీపీ బాగా గ‌డ్డి పెట్టింది. అస‌లు ఆ పార్టీని క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి కూడా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ నిఖార్సైన రాజ‌కీయానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి ప్ర‌సంగ‌మే…

మ‌హానాడు వేదిక‌గా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు టీడీపీ బాగా గ‌డ్డి పెట్టింది. అస‌లు ఆ పార్టీని క‌నీసం ప‌రిగ‌ణ‌లోకి కూడా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ నిఖార్సైన రాజ‌కీయానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడి ప్ర‌సంగ‌మే నిద‌ర్శ‌నం. టీడీపీకి త‌న‌వి త‌ప్ప‌, ఇత‌ర పార్టీల ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వ‌ని అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో మ‌హానాడు అట్ట‌హాసంగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా అచ్చెన్నాయుడు ప్ర‌సంగిస్తూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో 160 స్థానాల‌ను టీడీపీ గెలుచుకోవ‌డం ఖాయ‌మ‌న్నారు.

అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా టీడీపీది  ఎప్పుడూ ప్రజాపక్షమే అని ఆయ‌న అన్నారు. 2019లో ఓ దోపిడీ దొంగకు ప్రజలు ఓట్లేసి తప్పు చేశారన్నారు. సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమానంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.  అయితే చేసిన మంచి పనులను ప్ర‌జ‌ల‌కు చెప్పుకోలేకపోవ‌డం వ‌ల్లే ఓడిపో యామ‌ని అచ్చెన్నాయుడి కామెడీ చేశారు. 151 స్థానాలు రావడంతో జగన్ కళ్లు నెత్తికెక్కి ఒళ్లు మదమెక్కిందని తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.  

టీడీపీకి మ‌హానాడు అత్యంత కీల‌క‌మైన వేదిక‌. అలాంటి వేదిక‌పై పొత్తుల గురించి మాట మాత్ర‌మైనా అచ్చెన్నాయుడు ప్ర‌స్తావించ‌లేదు. కేవ‌లం 15 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ గెలుస్తుంద‌ని ఆయ‌న ప‌రోక్షంగా చెప్పారు. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే టీడీపీతో పొత్తు వుంటుంద‌ని బ‌హిరంగంగానే చెప్ప‌డం తెలిసిందే. వ్యూహం త‌న‌కు వ‌దిలేయాల‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. టీడీపీతో పొత్తు వుంటుంద‌నే ప‌వ‌న్ కామెంట్స్‌ని అచ్చెన్నాయుడు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా అన్ని స్థానాల్లో టీడీపీనే పోటీ చేస్తుంద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

ఇప్ప‌టికైనా ప‌వ‌న్‌కు జ్ఞానోద‌యం అయితే మంచిదే. మొద‌ట పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డంపై దృష్టి పెడితే, ఆ త‌ర్వాత అవ‌సరాలను బ‌ట్టి పొత్తు పెట్టుకోవ‌చ్చు. ఆ ప‌ని టీడీపీ చేస్తోంది. ప‌వ‌న్‌కు రాజ‌కీయ అవ‌గాహ‌న లేక‌పోవ‌డంతో అన్నీ ముందే మాట్లాడేస్తున్నారు. ప‌వ‌న్ అజ్ఞానాన్ని టీడీపీ రాజ‌కీయంగా సొమ్ము చేసుకునేందుకు వ్యూహాత్మ‌కంగా ముందుకు పోతోంది. రాజ‌కీయ అవ‌గాహ‌న లేని ప‌వ‌న్‌, క‌నీసం ఎదుటి పార్టీల ఎత్తుగ‌డ‌ల‌ను చూసైనా నేర్చుకుంటే మంచిద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.