అవినాష్ రెడ్డికి ఊరట.. బుధ‌వారం వ‌రకు నో అరెస్ట్!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అవినాష్ ముంద‌స్తు బెయిల్ పై బుధ‌వారం తీర్పు…

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. అవినాష్ ముంద‌స్తు బెయిల్ పై బుధ‌వారం తీర్పు వెల్ల‌డిస్తామ‌ని కోర్టు తెలిపింది. అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేయెద్ద‌ని సీబీఐని ఆదేశించింది.

కాగా నిన్న అవినాష్, సునీత లాయ‌ర్ల వాద‌న‌లు విన్న హైకోర్టు.. ఇవాళ సీబీఐ త‌రుపున వాద‌న‌లు వినింది. అవినాష్ త‌ల్లి అనారోగ్యం దృష్ట్యా ఆయ‌న్ను బుధ‌వారం వ‌ర‌కు అరెస్ట్ చేయ‌కుండా సీబీఐని అదేశించాల‌ని అవినాష్ రెడ్డి త‌ర‌ఫు లాయ‌ర్ కోర‌గా అందుకు కోర్టు అంగీక‌రించింది. దీంతో ఎంపీ అరెస్టు వ్యవహారం బుధవారం నాటికి స్పష్టత రానుంది.

కాగా వివేకాను హత్య చేయాల్సిన అవసరం అవినాష్‌కు ఏముందని.. అవినాష్‌ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్‌మెంట్లు ఉన్నాయి కదా? అని సీబీఐ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, ఉద‌య్‌కుమార్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? వాళ్ల నుంచి ఏమైనా స‌మాచారం రాబ‌ట్టారా? అని హైకోర్టు నిల‌దీసింది. వాళ్లు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌లేద‌ని కోర్టు దృష్టికి సీబీఐ త‌ర‌పు న్యాయ‌వాది తీసుకెళ్లారు. 

అవినాష్‌రెడ్డి కూడా విచార‌ణ‌కు స‌హ‌కరించ‌డం లేద‌ని.. ఎన్నిసార్లు నోటీసులిచ్చినా ఏదో ఒక‌సాకుతో త‌ప్పించుకుంటున్న‌ట్టు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. అవినాష్‌రెడ్డి కోరిన‌ట్టు ద‌ర్యాప్తు చేయ‌డం త‌మ ప‌నికాద‌ని సీబీఐ పేర్కొంది. బుధవారం ఎటువంటి తీర్పు వస్తుందో అని అంద‌రు ఎదురుచుస్తున్నారు.