సరిగ్గా ఏడాది కిందటి సంగతి. గతేడాది వేసవికి భారీ సినిమాలన్నీ క్యూ కట్టాయి. ఆర్ఆర్ఆర్ నుంచి మొదలుపెడితే.. ఆచార్య, సర్కారువారిపాట, ఎఫ్3, అంటేసుందరానికి, గని.. ఇలా స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమాలు చాలానే వచ్చాయి మార్కెట్లోకి. కానీ ఈ ఏడాది సమ్మర్ కు మాత్రం ఆ సందడి బొత్తిగా కనిపించలేదు.
దాదాపు స్టార్ హీరోలంతా మొహం చాటేశారు. మహేష్ బాబుకు మరోసారి గ్యాప్ తప్పలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలు సమ్మర్ ను స్కిప్ చేశాయి. అల్లు అర్జున్ ఇంకా షూటింగ్ లోనే ఉన్నాడు. పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటి హీరోలు థియేటర్లలోకి రావడానికి ఇంకా టైమ్ ఉంది.
అలా మార్చి నుంచి చూసుకుంటే, ఇప్పటిరకు దసరా, రావణాసుర, శాకుంతలం, ఏజెంట్, విరూపాక్ష, కస్టడీ, రామబాణం లాంటి సినిమాలు మాత్రమే వచ్చాయి. వీటిలో హిట్స్ కంటే ఫ్లాపులే ఎక్కువ. దీంతో ఈ ఏడాది వేసవి బాక్సాఫీస్ కళతప్పింది.
అయితే ఊహించని విధంగా మరోసారి డబ్బింగ్ సినిమాలు ఊపందుకున్నాయి. గతంలో వచ్చిన విక్రమ్, కాంతార, కేజీఎఫ్2ల రేంజ్ లో కాకపోయినా, ప్రస్తుతం మార్కెట్లో డబ్బింగ్ సినిమాల హవానే నడుస్తోంది.
రీసెంట్ గా వచ్చిన 2018 సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. అంతకంటే కాస్త ముందొచ్చిన బిచ్చగాడు-2 ఆల్రెడీ హిట్టయింది. ప్రస్తుతం మార్కెట్లో విజయవంతంగా నడుస్తున్న సినిమాలు ఈ రెండు మాత్రమే. తాజాగా వచ్చిన స్ట్రయిట్ సినిమాలతో పాటు, అంతకంటే ముందొచ్చిన అన్నీ మంచి శకునములే లాంటి సినిమాలేవీ నిలబడలేకపోయాయి.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాపై మాత్రమే ఆశలు పెట్టుకుంది బాక్సాఫీస్. ఇది కూడా రాకపోతే, ఈ ఏడాది సమ్మర్ కు విరూపాక్ష ఒక్కటే దిక్కయ్యేది.