నా కంటే గొప్ప నటుడు చంద్రబాబు అని ఏనాడో అన్న గారు పద్మ అవార్డుల కంటే గ్రేటెస్ట్ అవార్డు ఇచ్చేశారు. అలా మహా నటులు అంతా కలసి మహానాడు మీటింగుని రాజమండ్రి లో పెట్టారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పంచులు వేశారు.
ఎన్టీయార్ పైన చెప్పులు వేసి అధికారం నుంచి దించి ఆయన చావుకు కారణం అయిన వారు ప్రతీ ఏటా మహానాడు పెడతారని, ఆయన విగ్రహానికి ఒక దండం పెడతారని ఆమె ఎద్దేవా చేశారు. మహానాడు చేయాల్సిన తీర్మానాలు ఏంటో ఆమె చెప్పేశారు.
ఎన్టీయార్ కి వెన్నుపోటు పొడిచి మరణానికి కారణం అయినందుకు ఆయనకు కోట్లాది ప్రజలకు క్షమాపణలు కోరుతూ ఒక తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతులను డ్వాక్రా మహిళలను 2014 ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు వారికి క్షమాపణలు చెబుతూ మరో తీర్మానం చేయాలని కోరారు.
పోలవరం ముంచినందుకు ప్రత్యక హోదా తేనందుకు, ఏపీలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని చెప్పి ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలని కోరారు. అమరావతి జగన్ పేదలకు యాభై వేలకు పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో చివరికి అమరావతిలో కూడా టీడీపీ తుడిచి పెట్టుకుని పోయిందని వరుదు కళ్యాణి సెటైర్లు వేశారు.
ఎన్నికల వేళ హామీల మూటలు మోసుకొచ్చి జనాలను మభ్యపెడదామని చంద్రబాబు చూస్తున్నారని, కానీ ఇచ్చిన మాట ప్రకారం తుచ తప్పకుండా హామీలు నెరవేరుస్తున్న జగన్ని జనాలు ఎప్పటికీ వదులుకోరని ఆమె స్పష్టం చేశరు. చంద్రబాబుకు ఆయన పార్టీకి మేనిఫెస్టో గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు.