తిరుపతిలో శనివారం నిర్వహించిన రాయలసీమ ఆత్మగౌరవ ప్రదర్శన దిగ్విజయమైంది. తిరుపతి గంగజాతరకు భక్తులు పోటెత్తిన చందంగా, రాయలసీమ ఆత్మగౌరవాన్ని చాటేందుకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వంలో చేపట్టిన భారీ ప్రదర్శనకు జనం పోటెత్తారు. తిరుమలేశుని పాదాల చెంత కొలువుదీరిన తిరుపతిలో అన్ని ప్రాంతాల ప్రజానీకం జీవనం సాగిస్తోంది.
తిరుపతి జనం అంతా మహాప్రదర్శనలోనే ఉన్నారా? అనేంతగా వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. నగరంలోని కృష్ణాపురం ఠాణా నుంచి మహాప్రదర్శన బయల్దేరింది. ఎమ్మెల్యే భూమన, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష సీమకు ఇప్పుడు కాకపోతే, ఇంకెప్పటికీ న్యాయం జరగదంటూ రాసిన ప్లెక్సీలు చేతబూని ముందుకు నడిచారు. వీరి వెంట కార్పొరేటర్లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, విద్యార్థులు, కార్మికులు, ముఖ్యంగా వేలాది సంఖ్యలో మహిళలు నడిచారు.
ఆధ్మాత్మిక చింతనకు మారుపేరైన తిరుపతి … రాయలసీమకు న్యాయం చేయాలనే నినాదాలతో మార్మోగింది. తరలి రండి మన కోసం…క్షామ నేత క్షేమం కోసం; న్యాయ రాజధానిగా కర్నూలు, మన ఆత్మగౌరవ ఆనవాళ్లు; వద్దే వద్దు ఒకే చోట అభివృద్ధి, ఇది మహాప్రదర్శన… కావాలి వికేంద్రీకరణ తదితర స్ఫూర్తిదాయక నినాదాలతో తిరుపతి హోరెత్తింది.
కృష్ణాపురం ఠాణాకు ఉదయం నుంచే జనం పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంత మంది రావడం, ర్యాలీ పొడవునా వారిపై పూలచల్లుతూ ముందుకెళ్లడం ఉద్యమం జనజాతరను తలపించింది. కృష్ణాపురం ఠాణా నుంచి గాంధీరోడ్డు, నాలుగ్గాళ్ల మండపం, అటు నుంచి ప్రధాన వీధి మీదుగా కార్పొరేషన్ కార్యాలయానికి మహాప్రదర్శన చేరుకుంది. ఆ తర్వాత బహిరంగ సభ జరిగింది.