మచిలీపట్నం పోర్టుపై విచారణలో భాగంగా ప్రభుత్వ తరపు న్యాయవాది ముఖ్య విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దానిపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది సర్వత్రా చర్చనీయాంశమైంది. మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై నవయుగ పోర్ట్ లిమిటెడ్‌తో చేసుకున్న కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ మేరకు ప్రభుత్వం 2019లో జీవో 66 జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ నవయుగ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగింది. నవయుగ వ్యాజ్యంపై విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ రావు రఘునందనరావు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ నవయుగ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. చీఫ్ జస్టిస్‌తో పాటు మరో న్యాయమూర్తి డీవీఎస్ఎస్ సోముయాజులుతో కూడిన బెంచ్ విచారించాల్సి వుంది.
ధర్మాసనంలోని జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు గతంలో నవయుగ కంపెనీతో కలిసి పని చేశారని రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. న్యాయమూర్తుల్లో ఎవరికైనా విచారిస్తున్న కేసుకు సంబంధించి పరస్పర విరుద్ధ ప్రయోజనాలుంటే ఆ విషయాన్ని ముందుగానే కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఇందులో భాగంగానే తాము కోర్టు దృష్టికి తీసుకొస్తున్నట్టు ఏజీ తెలిపారు. తామేమీ ఆ న్యాయమూర్తిపై ఫిర్యాదు చేయడం లేదని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ తరపు న్యాయవాది ముఖ్య విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడంపై చీఫ్ జస్టిస్ హుందాగా స్పందించారు. నవయుగ అప్పీల్‌పై జస్టిస్ సోమయాజులు సభ్యుడిగా లేని ధర్మాసనం విచారిస్తుందని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. విచారణకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటవుతుందన్నారు. తమ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ కేసులో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, తామే ఈ అప్పీల్‌ను విచారిస్తే దీన్ని ప్రధాన కారణంగా చూపుతూ సుప్రీంకోర్టుకెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
అలాంటి పరిస్థితికి అవకాశం లేకుండా మరో ధర్మాసనం విచారించడం నైతికమని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం ప్రశంసలు అందుకుంటోంది. తీర్పుల ఫలితాలు ఎలా ఉన్నా కోర్టు విధి విధానాలు అందరికీ ఒకేలా ఉండాలని సీజే స్పష్టం చేయడం విశేషం. చీఫ్ జస్టిస్ సముచిత నిర్ణయం తీసుకున్నారని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎందుకంటే గతంలో కొన్ని కేసుల్లో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మాత్రం అందుకు బిన్నంగా వ్యవహరించడంతో ప్రభుత్వం కూడా సంతోషిస్తోంది.