ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సవతుల గొడవ నడుస్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ సవతుల్లా వ్యవహరిస్తున్నాయనే విమర్శ వుంది. రాజుకు ఇద్దరు భార్యలైతే, పెద్ద భార్యపై ప్రేమ కనబరిస్తే చిన్న భార్యకు కోపం లేదా చిన్న భార్యతో బాగుంటే పెద్దభార్య అలక అనే కథలు విన్నాం. బీజేపీ అనే రాజుకు టీడీపీ, వైసీపీ ఇద్దరు భార్యలన్న రీతిలో రాజకీయాలు నడుస్తున్నాయి.
ఓ సమావేశం నిమిత్తం ఢిల్లీకి చంద్రబాబు వెళ్లారు. ఆ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సమావేశం అనంతరం అందరితో పాటు చంద్రబాబును కూడా ప్రధాని అభిమానంతో పలకరించారు. దీన్ని టీడీపీ వర్గాలు తమకు రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు తపించాయి. టీడీపీ అనుకూల మీడియా సరేసరి.
చంద్రబాబు గారూ… మీతో ప్రత్యేకంగా మాట్లాడాలని ప్రధాని మోదీ అన్నారని “ప్రత్యేకంగా” చెప్పడం వెనుక వైసీపీని రెచ్చగొట్టడమే. గత మూడేళ్లుగా చంద్రబాబు ఎన్ని సార్లు అడిగినా బీజేపీ అగ్రనేతలెవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. తనకు తాను సందర్భాన్ని క్రియేట్ చేసుకుని, బీజేపీకి దగ్గరవ్వాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. అయినా ప్రధాని మోదీ, అమిత్షా దయచూపలేదు.
తాజాగా సమావేశానికి చంద్రబాబును పిలవడం బీజేపీలో వచ్చిన మార్పునకు నిదర్శనమని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబును సమావేశానికి పిలవడం, ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారనే వార్తలు వైసీపీకి కోపం తెప్పిస్తున్నాయి. ఏపీలో వైసీపీ, టీడీపీ, బీజేపీ వేటికవి ప్రత్యేకం. మూడు పార్టీలు బరిలో ఢీ అంటే ఢీ అని తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.
కానీ జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దలంటే టీడీపీ, వైసీపీ నేతలకు భయంతో కూడిన భక్తి. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ తన చేతిలో వున్న ఈడీ, సీబీఐ విచారణ సంస్థల్ని ఉసిగొల్పి వేటాడుతుందన్న భయం టీడీపీ, వైసీపీ నేతలకు నిద్ర కరువు చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తమకు గిట్టని పార్టీలను, నేతలను బీజేపీ దర్యాప్తు సంస్థలతో వేటాడుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో చంద్రబాబును ప్రధాని ఆప్యాయంగా పలకరించారని టీడీపీ నేతల మాటల్లో నిజం ఎంతో తెలియదు. కానీ అప్పుడప్పుడు ‘ అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ వుండండి. ఇది మీ ఇల్లు అనుకోండి’ అని చంద్రబాబును మోదీ కోరారని ఎల్లో బ్యాచ్ ప్రచారం చేసుకోవడం మాత్రం నవ్వు తెప్పిస్తోంది. ఈ రాతలు, ప్రేమ ఒలకబోతలన్నీ రాజు చిన్న భార్యను ఇరిటేట్ చేసేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నప్పుడే లేని ప్రేమాభిమానాలు ఇప్పుడు ఎలా వచ్చాయబ్బా అని వైసీపీ తన అక్కసు వెళ్లగక్కుతోంది.