టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు దేవాన్ష్ అనే కొడుకు ఉన్నాడని అందరికీ తెలుసు. అయితే ఆయనకు రెండో పెళ్లి అయిందని, సంతోష్ అనే కొడుకు కూడా ఉన్నట్టు వైసీపీ దుష్ప్రచారం చేసిందని స్వయంగా లోకేశ్ మీడియా సమావేశంలో చెప్పడం చర్చకు దారి తీసింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప క్లారిటీ ఇచ్చారు. దానిపై లోకేశ్ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం ఎస్పీ తేల్చి చెప్పారు. అది మార్ఫింగ్ చేశారా? లేదా? అనేది నిర్ధారించలేకపోతున్నట్టు ఎస్పీ అన్నారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకూ, అలాగే మొదట వీడియో పోస్టు చేసిన వ్యక్తి దొరికే వరకూ ఇది నిర్ధారణ చేయలేమన్నారు. వీడియోలో ఉన్నది ఎంపీ మాధవా? కాదా? అన్నది కూడా చెప్పలేమని ఎస్పీ ఆశ్చర్యపరిచారు. ఒరిజినల్ వీడియో వుంటేనే ఫోరెన్సిక్ నివేదిక వస్తుందన్నారు.
ఎస్పీ క్లీన్‌చిట్ ఇవ్వడంపై లోకేశ్ మండిపడ్డారు. ఆ వీడియో ఒరిజినల్ కాదని చెప్పడానికి ఎస్పీ ఎవరని లోకేశ్ ప్రశ్నించారు. ఎస్పీ ఏమైనా ఫోరెన్సిక్ నిపుణుడా అని నిలదీశారు. ఏ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందో చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు. నివేదిక చూపాలని ఆయన కోరారు. మహిళలను కించపరచడం వైసీపీ నేతలకు అలవాటైందన్నారు. తన తల్లిని కూడా అవమానించారని గుర్తు చేశారు. ఇటీవల తమ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంటే దాన్ని కూడా రాజకీయం చేశారని మండిపడ్డారు.
వైసీపీ నేతల్లా తాను ఆలోచించి వుంటే జగన్ భార్య భారతీరెడ్డిని, వారి ఇద్దరు కూతుళ్లపై వ్యాఖ్యలు చేసి వుండేవాడినన్నారు. కానీ మహిళలను కించపరిచే సంస్కారం తమది కాదన్నారు. తనపై 2012 నుంచి దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.
తనకు రెండో పెళ్లి అయిందని, సంతోష్ అనే కొడుకు ఉన్నట్టు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. లోకేశ్‌కు రెండో పెళ్లి, కుమారుడు అనే వైసీపీ దుష్ప్రచారం సంగతేమో గానీ, ఆయన చెప్పడంతో వైరల్ అవుతోంది.