షెడ్యూల్ కులాల (ఎస్సీ) వర్గీకరణ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల నెత్తిన పాలు పోసినట్టైంది. వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాల్సిన అంశమని పేర్కొంది. ఈ మేరకు వర్గీకరణపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతివ్వాలని ఎమ్మార్పీఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కొన్ని దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తున్నారు. రాజకీయ ఏకాభిప్రాయ సాధనకు ఆయన ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వర్గీకరణపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు గోడమీద పిల్లలా ప్రవర్తిస్తున్నాయి.
ఎస్సీ వర్గీకరణకు జై కొడితే మాలల ఓట్లు పోతాయనే భయం అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉంది. దీంతో ఎస్టీ వర్గీకరణకు అనుకూలమా? వ్యతిరేకమా? అని చెప్పడానికి మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పు కాసింత ఊరట కలిగించేదిగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చివరికి ఎమ్మార్పీఎస్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వర్గీకరణ ఎవరు చేయాలనే అంశంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ కేవలం పార్లమెంట్ చేయాల్సి వుంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కృష్ణమాదిగ మాట్లాడుతూ 18 ఏళ్ల పాటు ఎస్సీ వర్గీకరణ లేక మాదిగ ఉపకులాలు నష్టపోయాయన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఏడుగురు లేదా ఎనిమిది మంది జడ్జీల లార్జర్ బెంచ్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామన్నారు.
వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. తాము కోరుకున్నట్టుగా న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వర్గీకరణ ఉద్యమ ఫలితంగా అణగారిన వర్గాల్లో చైతన్యం వచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కారణంగా మాల, మాదిగల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. వాళ్లలో వాళ్లే కలహించుకునే పరిస్థితి.