టీడీపీ యువ నాయకుడు లోకేశ్ వ్యవహారం అంతా అతివృష్టం, అనావృష్టి అనే రీతిలో వుంటోంది. ఒక్కోసారి జనంలో బాగా కలిసిపోతారు. ఊరూరు తిరుగుతారు. ప్రత్యర్థులను హెచ్చరిస్తారు. టీడీపీ అధికారంలోకి వస్తే, వడ్డీతో సహా రుణం చెల్లించుకుంటామని విరుచుకుపడతారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోతారు.
సోదరుడు పవన్‌కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. షూటింగ్‌లు లేని సమయంలో మాత్రమే పవన్‌కల్యాణ్ జనంలోకి వచ్చే సంగతి తెలిసిందే. ఒకట్రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత ఏమవుతారో ఆయనకే తెలియదు. ఇప్పుడు లోకేశ్ పరిస్థితి అట్లే తయారైంది. పోనీ పవన్‌కు అంటే సినిమానే వృత్తి. లోకేశ్‌కు అట్లా కాదు కదా! అవునన్నా, కాదన్నా లోకేశ్ ఫుల్‌టైమ్ పొలిటీషియన్.
గత కొన్ని రోజులుగా ఆయన క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. సోషల్ మీడియాలో ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. అంతకు మించి, ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. మహానాడు తర్వాత పెద్దగా టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అంతోఇంతో చంద్రబాబునాయుడే మినీ మహానాడు కార్యక్రమాలకు వెళుతూ, ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అలాగే ప్రెస్‌మీట్లు పెట్టి, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు. కానీ లోకేశ్ మీడియా కంట కనపడకపోవడానికి కారణం ఏంటి? అక్టోబర్ 2 నుంచి పాదయాత్రకు సిద్ధమవుతున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అంత వరకూ ఆయన రెస్ట్ తీసుకుంటారా? ఈ లోపు తాను చేయాల్సిన పనులేవీ లేవా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ఇవాళ ట్విటర్ వేదికగా దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు లోకేశ్ సెల్యూట్ చెప్పారు. ఇవాళ కార్గిల్ విజయ్ దివస్‌ను పురస్కరించుకుని లోకేశ్ ట్వీట్ చేశారు. అలాగే ఈ నెల 25న సీనియర్ నటుడు సత్యనారాయణ, హీరో అయిన తమ్ముడు నారా రోహిత్‌లకు సోషల్ మీడియాలో లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. అంతకు మించి ఆయనకు సంబంధించి వార్తలేవీ ఎల్లో మీడియాలో కూడా కనిపించకపోవడం గమనార్హం.
ఎన్నికలకు రెండేళ్ల గడువు వున్న నేపథ్యంలో టీడీపీ కీలక నాయకుడిగా లోకేశ్ యాక్టీవ్ కావాల్సిన అవసరం ఉంది. అందర్నీ కలుపుకుని పోతూ, ఎన్నికల సమరానికి సమాయత్తం చేసే గురుతర బాధ్యత లోకేశ్‌పై ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. సైన్యాధ్యక్షుడి పాత్ర పోషించాల్సిన లోకేశ్ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజమే కదా!