ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లాంటి వారు రాజకీయాల్లో తప్పక వుండాలి. ఆయనే లేకపోతే తెలుగు సమాజ పరిస్థితి ఏమయ్యేదో? కొత్తకొత్త విషయాల్ని తనదైన శైలిలో ఆయన చెబుతుంటే రాజకీయాల్లో ఆ కిక్కే వేరబ్బా.
జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయం ప్రజాశాంతి పార్టీనే అని చెప్పగలిగిన దమ్మున్న నాయకుడు కేఏ పాల్. కేఏ పాల్ తెలుగు రాజకీయాల్లో లేకపోతే కామెడీ క్యారెక్టర్‌ను మిస్ అయ్యేవాళ్లం.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సీరియస్‌గా రాజకీయాలు నడుస్తున్న టైమ్‌లో సినిమాలో బ్రహ్మానందంలా కేఏ పాల్ ఎంటర్ అవుతారు. 2019 ఎన్నికల్లో ఏపీలో పాల్ పండించిన కామెడీ ఓ రేంజ్లో వుంది. తనకు తెలియకుండానే తన పార్టీ తరపున అభ్యర్థులను నిలిపారని సంచలన ప్రకటన చేశారు. చంద్రబాబునాయుడే తన పార్టీ తరపున బీ ఫారాలు అందచేశారని ఆయన ఆరోపించారు.
జనసేన పార్టీని తన పార్టీలో విలీనం చేయాలని అడిగే ధైర్యం పవన్‌కల్యాణ్‌కు తప్ప ఎవరికి వుంటుంది? కేఏ పాల్ తప్ప, మరెవరైనా ఇలా అడగగలరా? అలాగే వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీతో చతుర సంభాషణ పాల్ కాకుండా మరెవరైనా చేయగలరా? ఇదంతా ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకంటే… తాజాగా ఆయన మరో సరదా డిమాండ్ చేశారు.
ఈవీఎంలు వుంటే మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన బాంబు పేల్చారు. కావున ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ తిరిగే కేఏ పాల్ లాంటి గొప్ప వ్యక్తి కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని వద్దనడం భావ్యమా? ఏమో ఆయన ఏది చెబితే రైట్, కాదన్నది రాంగ్.
ఇంకో మాటండోయ్. ప్రజాశాంతి పార్టీలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చేరడానికి ఆసక్తి చూపుతున్నారని జోకేశాడు. కేఏ పాల్ నీ కామెడీని లోకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది బాస్.