సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా వ్యవహారం ఒక రోజంతా హల్‌చల్ చేసింది. చాలా కాలంగా ఆమె టీడీపీలో అసంతృప్తిగా వుంటున్నారు. దాన్ని బయట పెట్టడానికి మహానాడులో మాట్లాడించకపోవడం సరైన కారణంగా భావించారు. ఆమె క్రైస్తవ మతవిశ్వాసి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మతాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఆ క్రిస్టియానిటీపై వ్యతిరేక కామెంట్స్ చేయడాన్ని పలు సందర్భాల్లో దివ్యవాణి వ్యతిరేకించారు. దీంతో ఆమెను జగన్ కోవర్టుగా టీడీపీ అనుమానిస్తోంది. దీన్ని దివ్యవాణి జీర్ణించుకోలేకపోతున్నారని సన్నిహితులు చెబుతున్నారు.
దివ్యవాణి రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ట్విటర్‌లో రాజీనామా ప్రకటన చేశారు. ఇందులో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం సంచలనం రేకెత్తించింది. రాజీనామాను వెనక్కి తీసుకున్నప్పటికీ, ఆమె యూట్యూబ్ చానల్‌లోనూ, అలాగే రాజీనామాకు దారి తీసిన పరిస్థితిపై చేసిన ఘాటు కామెంట్స్ మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఎవరా దుష్టశక్తులనే ప్రశ్న టీడీపీలోని కొందర్ని భుజాలు తడుముకునేలా చేసింది.
దివ్యవాణితో పాటు టీడీపీలోని కమ్మేతర నాయకులు కొంత మంది వల్ల ఇబ్బంది పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అధికార ప్రతినిధులు ఆ సామాజిక వర్గం కబంధ హస్తాల నుంచి బయట పడడం ఎలా అని ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ముఖ్యంగా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి, టీడీపీ నాలెడ్జీ కమిటీ చైర్మన్ మాల్యాద్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్, అధికార ప్రతినిధుల వ్యవహారాలు చూసే నాయకుడు (కమ్మ), టీడీపీ మీడియా వ్యవహారాలు చూసే అనిల్ తదితరులంతా చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన వారే కావడం గమనార్హం.
వీళ్లు చెప్పిందే వేదంగా పార్టీ అధికార ప్రతినిధులు నడుచుకోవాల్సిన దుస్థితి. తనపై అనుమానంతో నోటిని కట్టేస్తున్నారని దివ్యవాణి ఆవేదన. కేవలం జగన్ కోవర్ట్ అనే అనుమానంతోనే మహానాడులో కూడా మాట్లాడించలేదని సన్నిహితుల వద్ద దివ్యవాణి ఆవేదన వెళ్లగక్కనట్టు సమాచారం. బాబు సామాజిక వర్గానికి చెందిన కోటరీ తనను ఎలా అణచివేస్తున్నదో పార్టీ పెద్దల దృష్టికి దివ్యవాణి తీసుకెళ్లినట్టు సమాచారం.
ఎవరో వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని రాజీనామా చేసి, అది నిజం కాదని తెలిసి వెనక్కి తీసుకున్నట్టు చెబుతున్నారు. మరి యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? దుష్టశక్తులనే మాట మనసులో ఏమీ లేకుండానే వచ్చిందా? అనే ప్రశ్నలకు సమాధానం ఎవరివ్వాలి? మొత్తానికి దివ్యవాణి రాజీనామాపై వెనక్కి తగ్గినప్పటికీ, మున్ముందు ఆమెకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు.