కవిత కరెక్టా? మీడియా చెప్పేది నిజమా?

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రాజకీయ నాయకుల ఇళ్లలో, వ్యాపారవేత్తల, చార్టర్డ్ అకౌంటెంట్ల ఆఫీసుల్లో సోదాలు చేయడం. ఢిల్లీ లిక్కర్ స్కాములో తెలంగాణా సీఎం కేసీఆర్…

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో రాజకీయ నాయకుల ఇళ్లలో, వ్యాపారవేత్తల, చార్టర్డ్ అకౌంటెంట్ల ఆఫీసుల్లో సోదాలు చేయడం. ఢిల్లీ లిక్కర్ స్కాములో తెలంగాణా సీఎం కేసీఆర్ ముద్దలా తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్ర పోషించిందని కొన్ని రోజుల కిందట ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బ్రహ్మాండం బద్దలైంది. 

తెలంగాణా బీజేపీ నాయకులు చెలరేగిపోయారు. కేసీఆర్, కేటీఆర్ గమ్మున ఉండిపోయారు. ఓ ప్రధాన తెలుగు దినపత్రికలో కేసీఆర్ కవితను మందలించినట్లు కూడా వార్త వచ్చింది. లిక్కర్ స్కాములో కవిత ఉందని బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలను ఆ పత్రిక హైలైట్ చేసింది కూడా. వెంటనే కవిత ఈ కుంభకోణమేమిటో తనకు తెలియదని, దానితో తనకు సంబంధం లేదని మీడియాకు చెప్పింది. తనపై దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించింది. ఈ కుంభకోణం వార్తను ప్రముఖంగా ప్రచురించిన పత్రిక ఎండి చేసిన ఇంటర్వ్యూ లో కవిత మాట్లాడుతూ లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధం లేదని చెప్పింది. 

నన్ను మా డాడీ మందలించారని మీరెట్లా రాస్తారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ కవితకు నోటీసులు ఇచ్చినట్లు మీడియా కోడై కూసింది. కానీ తనకు ఈడీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని కవిత చెప్పింది. ఢిల్లీలో తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నది.  అయితే లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది. 

శుక్రవారం దేశవ్యాప్తంగా 40 చోట్ల సోదాలు చేసింది. హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 12 మందికి, 18 కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన వారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిని కవిత ఖండించారు. ఈడీ కవిత ఆడిటర్ బుచ్చిబాబు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించింది హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలోని బుచ్చిబాబు నివాసంలో నలుగురు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిగాయి.

క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో ఈడీ ఇప్పటికే సోదాలు చేసింది. నోటీలుసు అందుకున్న వారిలో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, బోయిన్ పల్లి అభిషేక్‌ రావు, ప్రేమ్‌సాగర్‌రావు, అరుణ్ పిళ్ళై ఇతరులు ఉన్నారు. ఇండో స్పిరిట్, అరబిందో ఫార్మా, ప్రైమస్ ఎటర్ ప్రైసెస్ తో తదితర సంస్థలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కోకాపేట, దోమలగూడలో తనిఖీలు నిర్వహించింది. 

వాస్తవాలు ఇలా ఉంటే తనకు ఈడీ నోటీసులు ఇవ్వలేదని కవిత చెప్పడం విచిత్రంగా ఉంది. ఆమె కరోనా సోకి క్వారంటైన్ లో ఉండగా ఆమె సహాయకులకు నోటీసులు అందించారు. మరి కవిత చెప్పింది నిజమా? మీడియా చెప్పింది కరెక్టా?