బొత్సకు సరిసాటిగా కోలగట్ల

ఆయన విజయనగరం జిల్లాలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. 1989 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా తన రాజకీయాన్ని మొదలెట్టినా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయింది మాత్రం ఆ…

ఆయన విజయనగరం జిల్లాలో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. 1989 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ ద్వారా తన రాజకీయాన్ని మొదలెట్టినా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యే అయింది మాత్రం ఆ పార్టీ నుంచి కాదు. 2004లో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి అటు టీడీపీ మంత్రి అశోక్ గజపతిరాజుని ఇటు కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించి జెయింట్ కిల్లర్ అనిపించుకున్నారు. ఆయనే వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి.

ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన జిల్లాకు చెందిన తొలి నాయకుడు. అందుకు గాను జగన్ గుర్తించి ఆయన్ని ఎమ్మెల్సీగా చేశారు. 2018లో పాదయాత్ర వేళ జిల్లాలో తొలి టికెట్ ఆయనకే ప్రకటించారు. అలా విజయనగరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో స్వామి గెలిచారు. ఆయనకు మంత్రి పదవి చేపట్టాలని ఆశ. అయితే సామాజిక సమీకరణల వల్ల అది వీలు కాలేదు. ఆ పదవి బొత్స సత్యనారాయణకు దక్కింది.

మలివిడతలో కూడా కోలగట్లకు అవకాశం లభించలేదు. బొత్స సత్యనారాయణనే కంటిన్యూ చేశారు. దాంతో ఆయనకు ఇపుడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నారు. క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన ఈ పదవిలో కోలగట్లను కొనసాగనున్నారు. ఈ పదవితో ఆయన జిల్లాలో తన సహచరుడు అయిన బొత్సకు సరిసాటి అవుతారు. 

మంత్రి కావాలని కోరుకున్న కోలగట్లకు ఈ పదవితో అది తీరినట్లేనా అంటే స్వామి అభిమానులు మాత్రం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి మంత్రిగానే మా నేత ఉంటారని అంటున్నారు.