124ఏ అనే ఐఆర్పీసీ సెక్షన్ స్వాతంత్రానికి ముందు కాలం నుంచి కూడా దుర్వినియోగం అవుతూనే ఉన్నది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై రాజ ద్రోహం నేరం మోపాలని నిర్దేశించే ఈ చట్టం బ్రిటిష్ పరిపాలకులు ప్రవేశపెట్టినది. అప్పట్లో గాంధీ, నెహ్రూ సహా వేలాదిమంది స్వాతంత్ర్య పోరాటయోధులపై బ్రిటిష్ సర్కారు ఈ ఆస్త్రాన్ని ఒక కొరడా లాగా ప్రయోగిస్తూ వచ్చింది. రాజద్రోహం సెక్షన్‌ను రద్దు చేయాలని అప్పట్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ అందరూ డిమాండ్ చేశారు.
కానీ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ చట్టం రద్దు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. చాలా కన్వీనియంట్‌గా ఆ విషయాన్ని విస్మరించారు. ఇప్పటికి కూడా ప్రభుత్వ వ్యతిరేక దృక్పథాలు కలిగి ఉన్న వివిధ వ్యక్తులపై రాజ ద్రోహం చట్టం కింద అభియోగాలు నమోదు అవుతూనే ఉన్నాయి. వారు కటకటాల వెనక్కి వెళుతూనే ఉన్నారు. అయితే ఆధునిక సమాజంలో నవతరం రాజకీయాలలో రాజద్రోహం నిర్వచనం చెప్పే 124a సెక్షన్ సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది!
124 ఏ చట్టం కింద ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కుట్రలు చేసిన వారిని.. బెయిల్ పొందడానికి అవకాశం లేని కేసులతో కటకటాల్లోకి నెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రతి కేసు కూడా అంత దూరం వెళ్లడం లేదు. ప్రధానంగా న్యాయస్థానాలకు ఈ సెక్షన్ మీద దురభిప్రాయం ఉండడంతో.. దీని కింద నమోదవుతున్న కేసుల పట్ల ఉదాసీనత చూపిస్తున్నారు! ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న తరుణంలో.. ఈ చట్టం గురించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు! కేంద్ర ప్రభుత్వం చట్టం రద్దు గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు దేశవ్యాప్తంగా పోలీసులు ఎక్కడా కూడా కొత్తగా 124 ఏ సెక్షన్ కింద కేసులు నమోదు చేయకూడదు అని ఆదేశించారు. అయితే దేశంలో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.
2021 సంవత్సరంలో నమోదు అయిన రాజ ద్రోహం కేసుల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరి మీద రాజద్రోహం కేసులు పెట్టేస్తున్నదనే ప్రచారం ఇప్పుడు సర్వత్రా జరుగుతోంది. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా గమనించాల్సి ఉంటుంది. రాజద్రోహం నేరాన్ని ప్రభుత్వాలు ప్రత్యర్థులను అణచివేయడానికి వాడుకుంటున్నాయా లేదా ప్రతిపక్షాలే ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వాడుకుంటున్నాయా అనేది ఇప్పుడు మీమాంసగా మారుతోంది.
ఇతర రాష్ట్రాలతో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పెడమార్గం తొక్కి చాలా కాలమే అయింది. ప్రభుత్వాన్ని ఊపిరాడనివ్వకుండా అదే పనిగా తిట్టడం ద్వారా ప్రజలను మభ్యపెట్టగలమని నమ్మే వాళ్ళు ఇక్కడే ఎక్కువ! ‘ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకతను ప్రోది చేయడానికి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం సరిపోతుంది’ అని నమ్మే వాళ్ళు ఎక్కువ! ఆ మాటకొస్తే ఆధునిక తరపు గొబెల్స్ దళాలు ఏపీలో ఉన్నట్లుగా మరెక్కడా లేవు అంటే అతిశయోక్తి కాదు! ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేక కుట్ర కేటగిరిలోకి వచ్చేలా రెచ్చిపోయే దళాలు ఇక్కడే ఎక్కువ ఉన్నాయి! సహజంగా కేసులు కూడా ఇక్కడ ఎక్కువ నమోదు అవుతున్నాయి! అందుకే 124 ఏ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ అనేది ప్రభుత్వ ఆ చేతిలో బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగపడుతోందా! లేదా, ప్రతిపక్షాల చేతిలో బురద చల్లడానికి ఒక అస్త్రంలాగా తయారవుతోందా అనేది అర్థం కావడం లేదు!
ప్రభుత్వాన్ని కావాలనే రెచ్చగొట్టే తరహా మీడియా సంస్థలు వ్యక్తుల వ్యవహార సరళి ఏపీలో శృతిమించినట్టుగా మరో రాష్ట్రంలో మనం గమనించలేం. ఇక్కడ పార్టీలకు స్పష్టంగా మీడియా సంస్థలు కొమ్ముకాస్తుండడం వలన ఈ దుస్థితి దాపురించింది.