తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. వినాయకచవితి పండుగ నాడు బీహార్ కు వెళ్లనున్నారు. ఇక్కడ రాష్ట్రం మొత్తం పండుగ జరుపుకుంటున్న వేళలో.. ఆయన కీలకమైన రాజకీయానికి మంత్రాంగం నెరపనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోగా దేశంలో మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు గురించి.. తీవ్రమైన కసరత్తు చేస్తున్న కేసీఆర్.. తాజాగా మోడీతో సున్నం పెట్టుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన బీహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ లతో భేటీ కాబోతున్నారు.
కొన్నేళ్లుగా.. కేంద్రంలో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది సరికొత్త భేటీ. ప్రధాని నరేంద్రమోడీతోను, బిజెపి పార్టీతోనూ దేశంలో ఎవ్వరు సున్నం పెట్టుకున్నా సరే.. తక్షణం కేసీఆర్ అక్కడ వాలిపోతారని, వారితో స్నేహబంధం కలుపుకుని.. తను ప్లాన్ చేస్తున్న కొత్త కూటమిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారని ప్రజలు అనుకుంటున్నారు.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ దేశవ్యాప్తంగా కూడా ప్రజలకు పరిచయమున్న రాజకీయ నాయకుడు. నిజాయితీగా పనిచేస్తారనే పేరున్న నాయకుడిగా దేశవ్యాప్త గుర్తింపూ ఉంది. ఒక దశలో మోడీకి ప్రత్యామ్నాయంగా ఆ కూటమి ఎంచుకోగల నాయకుడిగా కూడా ఆయన వార్తల్లోకి వచ్చారు.
సాధారణంగా.. తనకు పోటీ కాగల సీనియర్ నాయకులు అందరినీ తొక్కుకుంటూ.. మోడీ తన రాజకీయ ప్రస్థానం సాగిస్తుంటారు గానీ.. బీహార్ స్థానిక అవసరాల దృష్ట్యా నితీశ్ ను పక్కన పెట్టలేదు. అక్కడి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కంటె, జెడియూకు తక్కువ సీట్లు వచ్చినా .. ఆయననే సీఎం చేశారు. అయినా సరే.. పార్టీని చీల్చడానికి బిజెపి కుట్ర చేస్తున్నదనే అనుమానం కలిగిన నితీశ్.. ముందే మేలుకుని తేజస్వీ యాదవ్ తో చేతులు కలిపి (ప్రస్తుతానికి) స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్థిరత్వం సంగతి ఎలా ఉన్నప్పటికీ.. జెడియూను చీల్చడానికి ఉండగల అవకాశాలకు గండికొట్టారు. ఆ రకంగా మోడీ వ్యతిరేక కూటమిలోకి మారారు.
దేశంలో మూడో కూటమి రావాలనే ఎజెండాతో అనేక రాష్ట్రాల్లోని భాజపా వ్యతిరేక పార్టీల నేతలతో పలు విడతలుగా చర్చలు జరుపుతున్న కేసీఆర్ ఇన్నాళ్లూ నితీశ్ జోలికి వెళ్లలేదు. ఇప్పుడు ఆయన మద్దతును కూడా ఆశిస్తూ వినాయకచవితి పర్వదినం నాడు.. ఆయన ఇంటి విందు స్వీకరించి, రాజకీయ మంతనాలు సాగించబోతున్నారు.
కేసీఆర్ ప్రయత్నాలు చురుగ్గానే సాగుతున్నాయి గానీ.. ఇవి సఫలం కావడానికి చిన్న మెలిక ఉంది. మమతా బెనర్జీ వంటి నాయకులు ఇతరుల మీద ఆధారపడే అవసరం లేని బలం కలిగి ఉన్నారు. కానీ వారు ఏకపక్షంగా కేసీఆర్ మాటలకు జై కొడతారని, ఆయన నాయకత్వాన్ని ఆమోదిస్తారని అనుకోలేం. ప్రధాని అభ్యర్థిగా తానే ఉండాలనే మమత అనుకుంటారు. మిగిలిన సమీకరణాల్లో తమిళనాడులో స్టాలిన్ గానీ, కర్నాటకలో దేవెగౌడ గానీ, ఇప్పుడు బీహార్ లో నితీశ్ గానీ.. వీళ్లందరూ కాంగ్రెస్ తో స్నేహంగా మనుగడ సాగిస్తున్నవారే.
కేసీఆర్ కు ఉన్న స్థానిక సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్ తో వారి బంధం ఆయనకు కిట్టదు. కాంగ్రెస్ ను వదిలేసి.. తాను ప్రతిపాదిస్తున్న కూటమిలోకి రావాలనేది ఆయన ప్రధానమైన కోరిక! అందుకు వారందరూ సంసిద్ధంగా ఉంటారా లేదా? అనేదే సంశయం.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ఖరారు చేసేసుకున్నారు. పెద్దపల్లి సభలో ఆ విషయం ఆయన చాలా స్పష్టంగా ప్రకటించారు. హస్తిన రాజకీయాల్లోకి వెళ్లడం వరకు ఆయన ఇష్టం. కానీ.. ఆయనను నమ్మి ఎన్ని పార్టీల వారు కలిసి వస్తారు. అందులో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పొత్తు బంధాలను కూడా వదులుకుని ఎందరు ఆయన మాటకు విలువ ఇస్తారు అనేది వేచిచూడాలి.