విజయ్ దేవరకొండ కెరీర్ బాగుండాలంటే

సక్సెస్ఫుల్ నటుడికి ముఖ్యంగా కావల్సింది ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా అందమో, ట్యాలెంటో అని చెప్పొచ్చు. కొంతమంది “లక్” అని కూడా చెప్తారు.  Advertisement అన్నీ కరక్టే. కానీ వీటన్నిటికంటే కావాల్సినది మరొకటుంది. అదే…

సక్సెస్ఫుల్ నటుడికి ముఖ్యంగా కావల్సింది ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానంగా అందమో, ట్యాలెంటో అని చెప్పొచ్చు. కొంతమంది “లక్” అని కూడా చెప్తారు. 

అన్నీ కరక్టే.

కానీ వీటన్నిటికంటే కావాల్సినది మరొకటుంది. అదే “వినయం”. 

అదేంటి వినయం లేకపోతే సక్సెస్ఫుల్ కారా? ఈ ప్రశ్న వేసుకుంటే మనకు చాలామంది నటులు కనిపిస్తారు. వేదికల మీద, ప్రెస్ మీట్స్ లోనూ పొగరుగా మాట్లాడే వాళ్లు కొంత మంది వెలుగుతారు. వాళ్ల కెరీర్స్ ప్రస్తుతం ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. కాస్త పొగరు చూపిస్తే ట్రోలింగ్స్ తో ఆడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. 

వినయమనేది పుట్టకతో రావాలి కానీ బలవంతంగా నటించలేం కదా అని అడగొచ్చు. 

అసలే నటులు..ఆ మాత్రం నటించలేకపోతే ఎలా?

ఒకానొక పెద్ద హీరో దశాబ్దాలుగా ఒక స్థాయిలో ఉంటున్నారు. ఆయన వేదికల మీద, ప్రెస్ మీట్లలోనూ ఎప్పుడు మాట్లాడినా వినయంగానే మాట్లాడతారు. పొగరు చూపించరు.  కానీ కొందరు అనేదేమిటంటే వారు సహజసిద్ధంగా అంత మెత్తగా మాట్లాడే టైపు కాదని. అయితే వారికున్న కోపమైనా, చిరాకైనా, మరే నెగటివ్ ఫీలింగైనా ఆఫ్ ద కెమెరానే ప్రదర్శిస్తారు తప్ప ఆన్ కెమెరా అవి బయట పడకుండా జాగ్రత్త తీసుకుంటారని. అంత జాగ్రత్త పడ్డారు కనుకనే అన్నేళ్లు స్టారుగా వెలుగుతున్నారు. 

అలాగే మరొక పాతతరం స్టార్ హీరో. ఆయనకి నిర్మాతల హీరోగా పేరు. నిర్మాతకి నష్టమొస్తే తదుపరి సినిమా ఫ్రీగా చేసిపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఆ గుణం పక్కన పెడితే ఈయన కూడా సౌమ్య గుణాన్నే మీడియా వద్ద చూపేవారు. అప్పట్లో పత్రికలే ఉండేవి. ప్రెస్ మీట్లో వినయంగా ఉంటే రాసేవాళ్లు నాలుగు మంచి మాటలు ఎక్కువగా రాసేవారు. అలా ఈయన స్టార్డం పెరుగుతూ వచ్చింది. 

ఇక పక్క రాష్ట్రానికి చెందిన మరొక స్టార్. ఈయన శైలి విభిన్నం. సిగరెట్ గిరాగిరా తిప్పి నోట్లో వేసుకుని స్టైలిష్ గా, పొగరుగా తెర మీద ఎలా కనిపించినా, బయట మాత్రం చాలా వినయంగా అందరితో కలిసిపోతూ ఉండేవారు. దశాబ్దాలపాటు స్టార్ గా వెలిగాక ఉత్తరభారతదేశంలో ఒక గుడిలో కూర్చుంటే బిచ్చగాడనుకుని ఒకావిడ ఈయనకి డబ్బులిచ్చిందట. అప్పుడు కూడా “ఠాట్! నేను స్టారుని. నీకెలా కనిపిస్తున్నాను” అంటూ కన్నెర్ర చెయ్యలేదు, సిగ్గుతో కుంచించుకుపోలేదు. ఈ సంఘటనని ఎంతో వినయంగా ఆయన బయటికి చెప్పేసుకున్నారు. తనని తాను తగ్గించుకుని మాట్లాడడమంటే ఈయనకి చాలా ఇష్టం. తన స్థాయంతా భగవంతుడు కల్పించిందే తప్ప తనదేమీ లేదంటాడు. వేదికల మీద రాజకీయాలు గట్రా మాట్లాడడు. అందరి మన్ననలు పొందాడు. అందుకే తిరుగులేని స్టారయ్యాడు. 

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది సక్సెస్ఫుల్ స్టార్లకి “వినయం”, “వినమ్రత” అనేవి సోపానాలయ్యాయి. 

పైన చెప్పుకున్న ముగ్గురు హీరోలు ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫీల్డులో నిలబడి పైకొచ్చినవారే. 

అదే విధంగా ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా హీరో అయ్యాడు. “అర్జున్ రెడ్డి”లో తాను పోషించింది పొగరుతో కూడిన పాత్ర. మంచీ, మర్యాద, పద్ధతి లేని పాత్ర అది. నటుడిగా ఆ పాత్రకి తగ్గట్టుగా నటించి మెప్పు పొందాడు. ఎందరో ఫ్యాన్స్ తోడయ్యారు. కానీ ఆ పాత్రలోంచి బయటికి రాకుండా అదే తన సహజ శైలి అన్నట్టుగా కొనసాగుతూ కెరీర్ ని దెబ్బ తీసుకుంటున్నాడు. 

“లైగర్” సినిమాని చూసిన వాళ్లల్లో కొంతమంది- “సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నంత బ్యాడ్ గా అయితే లేదు. విజయ్ దేవరకొండ మీద నెగటివిటీ వల్లే యావరేజ్ సినిమాని డిసాస్టర్ చేసేసారు ఆడియన్స్” అని చెప్తున్నారు. 

అంటే ఒకవేళ అతని వ్యవహారశైలి నచ్చుంటే యావరేజ్ ని హిట్ చేసే అవకాశమున్నట్టే కదా!

గతంలో ఇలాంటివి చాలా ఉదాహరణలున్నాయి. హీరో నచ్చితే యావరేజ్ కంటెంటులు హిట్టయాయి కూడా. ఆ లెక్క పక్కన పెట్టినా హీరో మీదున్న పాజిటివ్ ఫీలింగ్ వల్ల సినిమా దెబ్బ తిన్నా కనీసం ట్రోలింగులు, వెక్కిరింపులు అయితే ఉండవు. 

హీరో ఇమేజ్ సినిమాకి ప్లస్ కావాలి కానీ, మైనస్ కాకూడదు కదా! 

ఈ విషయంలో లేటెస్ట్ ఎగ్జాంపుల్ నిఖిల్ సిద్ధార్థ. ఏ రకమైన నెగిటివిటీ అతని మీద లేదు. పైగా గత నాలుగైదు సినిమాలుగా వేదికల మీద పద్ధతిగా ఉంటున్నాడు. మీడియాతో పేచీల్లేవు. ఫలితంగా సోషల్ మీడియా న్యూట్రల్ గా ఉంది. కార్తికేయ-2 కంటెంట్ పరంగా అబోవ్ యావేజ్ అయినా బ్లాక్ బస్టర్ చేసేసారు ప్రేక్షకులు. చుట్టూ పాజిటివిటీ స్ప్రెడ్ చేసుకోవడమంటే ఇదే. 

విజయ్ ని చూసి నేర్చుకోవల్సింది ఏంటంటే ఆఫ్-స్క్రీన్ లో ఎలా ఉండకూడదు అనేది. కెరీర్ కుదుట పడాలంటే అతను కూడా పద్ధతి మార్చుకోవాలి. లేకపోతే పరిస్థితులు చేయి దాటి పోతాయి. 

ఒక్కో రంగానికి కావాల్సిన గుణాలు కొన్నుంటాయి. సహజంగా లేకపోతే అలవాటు చేసుకోవాలి. 

సినిమా నటులు కర్మయోగుల్లాగ తమ పని తాము చేసుకుపోవాలి తప్ప వారి మీద జరిగే సోషల్ మీడియా దాడులకి కూడా రియాక్ట్ కాకూడదు. అదేంటి? బాధొస్తే తిరగపడకూడదా అంటే కూడదంతే. 

మొన్నటికి మొన్న అనసూయ “ఆంటీ” అంటే కేసు పెడతానని, తనను ఏజ్ షేం చేయొద్దని వాపోయింది. మహిళగా ఆమెకు ఆ హక్కు ఉంది గానీ నటిగా మాత్రం లేదనే చెప్పాలి. జనం యొక్క అటెన్షన్ వల్ల బతికే ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ట్రోలింగులు ఫేస్ చెయ్యక తప్పదు. వాళ్లతో వాదనకు దిగితే మరింత పెరిగేదే తప్ప తగ్గేది కాదు. 

ఆర్మీలో సైనికుడు సీనియర్ ఆఫీసర్ చెప్పింది చెయ్యాలి తప్ప కౌంటర్ వెయ్యకూడదు. దూకమంటే దూకాలంతే…”కాళ్లు విరిగుతాయేమో సర్” అన్నాడంటే వాడు మిలిటరీకి అనర్హుడు. సీనియర్ చెప్పినప్పుడు ఫాలో అవ్వాలి తప్ప సొంత బుర్ర వాడకూడదు. అక్కడ కామన్ సెన్స్ కి తావుండదు. అలాగని దూకినవాడికి కామన్ సెన్స్ లేదని కాదు. వృత్తి ధర్మంగా దూకాలంతే. 

అలాగే సినిమానటులు కూడా. ఇక్కడ కష్టమనిపించినా కొన్ని పాటించాలి. కష్టమంటే కెరీరుండదు. 

1. పబ్లిక్ లో సొంత డబ్బా లేకుండా మాట్లాడాలి

2. మీడియాతో వినయంగా ఉండాలి 

3. సోషల్ మీడియాలో ట్రోలింగులకి రియాక్ట్ కాకూడదు, రెస్పాన్స్ ఇవ్వకూడదు

4. పాలిటిక్స్ మాట్లాడకూడదు, పొలిటికల్ ఇంటరెస్ట్ చెప్పకూడదు

ఈ నాలుగూ ముఖ్యమైన స్థంభాలు. ఇవి పాటిస్తే తెర మీద పోషించే పాత్ర ఏదైనా జనం బయట గౌరవిస్తారు. దీనికి ఎక్స్ట్రీం ఉదాహరణ సన్నీ లియోన్. ఆమె ఆదర్శవంతమైన పాత్రలేవీ చెయ్యలేదు. సినీనటి కాక ముందు ఆమెది ఏ ప్రొఫెషనో కూడా అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆమెను ఎవ్వరూ ట్రోల్ చెయ్యరు. కారణాలు పైన చెప్పుకున్నవే. 

కెరీర్ బాగుండాలనుకునే నేటి తరం హీరోలు, ట్రోలింగులకి గురి కాకూడదనుకునే సీనియర్ నటులు కనీసం సన్నీ లియోన్ ని చూసైనా నేర్చుకోవాలి. 

శ్రీనివాసమూర్తి