రాజశ్యామల అమ్మవారు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలకు ఇలవేలుపు. ఆ అమ్మ దయతో చల్లని చూపుతో కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీ సీఎం జగన్ కూడా సీఎం అయ్యారు. ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. ఈ ముగ్గురూ రాజ శ్యామల యాగం చేశారు. కేసీఆర్ అయితే చాలా సార్లు యాగం చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో రాజశ్యామల యాగం చేశారు.
జగన్ తరఫున వైసీపీ నేతలు విశాఖ శ్రీ శారదాపీఠంలో రాజ శ్యామల యాగం 2019 ఎన్నికల ముందు చేయించారు అని ప్రచారం సాగింది. ప్రతీ ఏటా శ్రీ శారదాపీఠం వార్షికోత్సవం సందర్భంగా రాజ శ్యామల యాగం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగా భాగంగా రాజశ్యామల అమ్మ వారిని భక్తులంతా పెద్ద ఎత్తున దర్శించుకుంటారు.
ఈ నెల 21న యాగాదులు అన్నీ ముగుస్తాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ కి పీఠం స్వయంగా ఆహ్వానించింది. దాంతో ఈ నెల 21న జగన్ ప్రత్యేకించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వస్తున్నారు.
ఆయన ఆ రోజు విశాఖలోని శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ రోజున ఉదయం ఉదయం పది గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖలోని చినముషిడివాడ శారదాపీఠానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమలలో పాల్గొని శ్రీ శారదా పీఠంలోని రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుంటారని తెలుస్తోంది. అనంతరం ఆయన నేరుగా తాడేపల్లికి బయల్దేరి వెళ్తారు. జగన్ కేవలం రాజశ్యామల ఆశీస్సుల కోసమే విశాఖకు వస్తున్నారు.