ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్‌లో ఆ ఇద్దరు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. జగన్‌పై ఈగ వాలినా వాళ్లిద్దరూ చీల్చి చెండాడేవారు. ఇప్పుడు వాళ్లలా జగన్‌కు గట్టి మద్దతుదారులుగా నిలిచే మంత్రులు కరువయ్యారు. జగన్ స్వీయ తప్పిదానికి తగిన మూల్యం చెల్లిస్తున్నారు. తన కోసం అండగా నిలబడాలని మంత్రులను స్వయంగా అర్తించాల్సిన దుస్థితి జగన్‌కు ఏర్పడింది.
జగన్ కేబినెట్‌లో కొడాలి నాని, పేర్ని నాని లేని లోటు ఎవరూ భర్తీ చేయలేరని సీఎం ఆవేదనతో తెలిసొచ్చింది. గత రెండున్నరేళ్లలో ఎప్పుడూ జగన్ ఇలా ఆవేదన చెందిన సందర్భం లేదు. సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ప్రతిపక్షాలు విమర్శల దాడి పెంచాయి. మరోవైపు అధికార పక్షం నుంచి దీటుగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి కరువైంది. ఇక తనతో పాటు కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసినా వివరణ ఇవ్వడానికి, ఖండించడానికి జగన్‌కు సమయం దొరకడం లేదు.
జగన్ లేదా ఆయన కుటుంబ సభ్యులెవరైనా విమర్శలు చేస్తే… గతంలో కొడాలి నాని, పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడే వారు. పేర్ని నాని తనదైన వ్యంగ్యం, అలాగే కొడాలి నాని బుల్లెట్ లాంటి విమర్శలతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే వాళ్లు. జగన్‌పై అభిమానం ఉండడం వల్లే తమ నాయకుడి సమస్యను తమదిగా భావించి కౌంటర్లు ఇచ్చేవాళ్లు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వాళ్లు.
మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ పేరుతో జగన్ అతిపెద్ద తప్పు చేశారు. తనను ఎంతో అభిమానించే కొడాలి నాని, పేర్ని నానిలను తప్పించి, తన కళ్లను తనే పొడుచుకున్నట్టైంది. మంత్రి వర్గం నుంచి తప్పించినా కొడాలి నాని, పేర్ని నాని అప్పుడప్పుడు వచ్చి ప్రత్యర్థులను చెడుగుడు ఆడుతున్నారు. కానీ ప్రత్యర్థుల విమర్శలకు వీరి డోస్ సరిపోవడం లేదు. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న వాళ్లలో బాగా మాట్లాడగలిగే వాళ్లు ఉన్నప్పటికీ, గోడమీద పిల్లుల్లా తప్పించుకుని తిరుగుతున్నారు.
భవిష్యత్‌లో రాజకీయ పరిస్థితు ఎలా ఎదురు కానున్నాయో అనే దూర దృష్టితో ప్రత్యర్థులపై విమర్శలకు దిగడం లేదు. దీంతో చుట్టూ అందరూ ఉన్నా, జగన్ ఒంటరి వాడయ్యారు. అదే ఆయనకు ఆవేదన కలిగిస్తోంది. ఏవేవో లెక్కలు వేసుకుని కొడాలి నాని, పేర్ని నానిలను తప్పించినందుకు జగన్‌కు ఆ మాత్రం శిక్ష పడాల్సిందే అని సొంత పార్టీ నేతలే అంటున్నారు.