ఎవరు ఎన్ని కాదన్నా, ఎన్ని చెప్పినా, పవన్ కళ్యాణ్ దగ్గర దర్శకుడు త్రివిక్రమ్ మాటే చెల్లుబాటు అవుతోందన్నది వారి వ్యవహారాలు దగ్గర నుంచి గమనిస్తున్నవారు లెక్క తేలుస్తున్న విషయం. కొద్ది రోజుల క్రితం వున్నట్లుండి వినోదసితం అనే రీమేక్ ను త్రివిక్రమ్ నే పవన్ దగ్గరకు తీసుకెళ్లారు. సముద్రఖని దర్శకుడు అని, తనే స్క్రిప్ట్ చేసే బాధ్యత తీసుకున్నారు. దానికి ఫలితంగా సినిమాకు తన స్వంత బ్యానర్ ఫార్ట్యూన్ ఫోర్ ను జోడించడానికి నిర్మాతలు అయిన పీపుల్స్ మీడియా సంస్థను ఒప్పించారు. కాస్టింగ్ అంతా త్రివిక్రమ్ నే సెట్ చేసారు. మళ్లీ తను చెప్పే వరకు వేరే పని పెట్టుకోవద్దని, ఏక్షణమైనా ఈ సినిమా మొదలవుతుందని హీరో సాయి ధరమ్ తేజ్ కు స్వయంగా చెప్పారు.
కానీ త్రివిక్రమ్ అన్ని పనుల పెట్టుకుని మహేష్ సినిమా మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదని గ్యాసిప్ లు బలంగా రావడం, గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మహేష్ బాబు కూడా స్క్రిప్ట్ పూర్తిగా తయారు కాకుండా సెట్ మీదకు వెళ్లేది లేదని చెప్పేయడంతో, వినోదసితం మాటల పనిని బుర్రా సాయి మాధవ్ కు అప్పగించారు. ఆ పని బుర్రా చేసినా దానిని మళ్లీ ఫైన్ ట్యూన్ చేసే పని తనమీదే వుంచుకున్నారు.
ఇటీవలే తొలిసగం పని పూర్తయింది. ఇవన్నీ కాస్త ముందుగా అవుతాయి అనుకుంటే పవన్ పొలిటికల్ షెడ్యూళ్లు, బుర్రా సాయి మాధవ్ డైలాగ్ వెర్షన్ ఇవ్వడంలో ఆలస్యం అన్నీ కలిసి కాస్త వెనక్కు నెట్టాయి. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు మహేష్ సినిమా మీద త్రివిక్రమ్ బిజీ అవుతున్నారు. ఈ టైమ్ లో ఆయన వినోదసితం మీద దృష్టి పెట్టలేరు. అందుకే మళ్లీ పవన్ మనసు మార్చుకున్నారు. క్రిష్ సినిమా హరిహర వీరమల్లు సినిమాను పూర్తిగా ఫినిష్ చేసిన తరువాతే వినోద సితం మీదకు రావాలని డిసైడ్ అయ్యారని బోగట్టా.
త్రివిక్రమ్ మాట మేరకు ఇన్నాళ్లు తను చేస్తున్న సినిమాను పక్కన పెట్టిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు మళ్లీ తన పనులు తాను మొదలుపెట్టాలి. ఈ సినిమాను నమ్ముకుని నటుడిగా రెండు మూడు మంచి ప్రాజెక్ట్ లు వదులుకున్న సముద్రఖని ఎటూ కాకుండా ఖాళీగా కూర్చోవాలి.
మొత్తం మీద త్రివిక్రమ్ ఏ సినిమా చేయించాలి అనుకుంటే పవన్ ఆ సినిమా మీదకు వెళ్తారని ఇలాంటి వాటి వల్లే క్లారిటీగా తెలుస్తోంది. తెరవెనుక జరుగుతున్నవి తెలిసిన వారికి సాయి ధరమ్, సముద్రఖని లకు ఎవరు ఎప్పుడు ఎలా డైరక్షన్ ఇస్తున్నదీ తెలుసు. మరి ఇప్పుడు ఇలా మారిన వైనమూ తెలుస్తుంటే లెక్కకు సమాధానం ఎలా రావాలో అలాగే వస్తోంది.