ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ ప్రముఖుడే కాకుండా పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, మీడియా అధినేత కూడా కాబట్టి ఆయన సర్కిల్ చాలా పెద్దగా ఉంటుంది. సహజంగా అనేకమంది మిత్రులుంటారు. వారిలో కొందరు ఆప్తమిత్రులు ఉంటారు. అంటే జిగ్రీ దోస్తులన్నమాట. అలాంటి జిగ్రీ దుస్తుల్లో సినిమా హీరో నాగార్జున ఒకడు. ఈ సంగతి చాలామందికి తెలుసు.
ఇప్పుడు ఆ స్నేహాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఆ అవకాశం నాగార్జున ఇస్తాడా? ఇవ్వడా? అనేది తెలియడానికి ఇంకా సమయం ఉంది. ఇదిప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణా దినపత్రిక ఒకటి ఈ విషయాన్ని ప్రముఖంగానే రాసింది.
అసలు విషయమేమిటంటే … ఆంధ్రప్రదేశ్లో 2024 లో జరుగుబోయే ఎన్నికలకు ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవు తున్నాయి. దీంట్లో భాగంగా పలు నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఏపీలో ఇంకా ఎన్నికలకు 18 నెలల సమయం ఉంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహాన్ని అమలు చేయడానికి పావులు కదుపుతున్నాయి.
అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కొద్దిమందికి అభయమివ్వగా మరికొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదే కోవలో ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జునను విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైసీపీ ఎంపీగా పోటీలో దింపేందుకు వైసీపీ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
2014, 2019 లో వైసీపీ అభ్యర్థులుగా పారిశ్రామిక వేత్తలు కోనేరు రాజేంద్రప్రసాద్. పొట్లూరి వరప్రసాద్ లు విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే 2024 లో అయినా ఎంపీ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని అందుకు ఇప్పటినుంచే వైసీపీ పెద్దలు నేతల అన్వేషణలో పడ్డారు. ఈ మేరకు నాగార్జున పేరును కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశముందని భావిస్తున్నారని సమాచారం.
వైఎస్ఆర్సీపీకి చెందిన కొంత మంది నేతలు ఈ అంశంపై హింట్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో ఈ వార్త విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. నాగార్జున పోటీ చేస్తే విజయవాడలో పరిస్థితి ఎలా ఉంటుందా అని విశ్లేషణలు కూడా చేస్తున్నారు.
గత రెండు సార్లు విజయవాడ నుంచి టీడీపీ తరపున కేశినేని నాని ఎంపీగా గెలిచారు. రెండు సార్లు పారిశ్రామికవేత్తలను వైఎస్ఆర్సీపీ బరిలోకి దింపింది. కానీ గెలవలేకపోయారు. తర్వాత వారు రాజకీయాల్లో అంత చురుగ్గా లేరు. విజయవాడలో స్టార్ హీరో అయితే ప్లస్ అవుతుందన్న అంచనాల్లో వైసీపీ హైకమాండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే నాగార్జున పేరును పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.
నాగార్జున ఇంత వరకూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు. అయితే ఆయన జగన్మోహన్ రెడ్డికి ఆప్తమిత్రుడు.ఈ విషయాన్ని ఆయనే ప్రకటించుకున్నారు. సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వానికి మధ్య వివాదం ఏర్పడినప్పుడు ఓ సారి నాగార్జున ఒంటరిగానే సీఎం జగన్ ను కలిశారు. చూసి చాలా రోజులు అయిందని అందుకే కలిశానని చెప్పారు.
జగన్, నాగార్జున మధ్య సన్నిహిత సంబంధాలు.. ఉన్నాయని..జగన్ అడిగితే నాగార్జున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తారని వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే నాగార్జునకు రాజకీయాలపై ఆసక్తి ఉందో లేదో స్పష్టత లేదు. ఆయన వైపు నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వర రావుకు కూడా రాజకీయాల పట్ల ఆసక్తి లేదు.
ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు అక్కినేనిని రాజకీయాల్లోకి రావాలని అడిగారు. కానీ తనకు ఆసక్తి లేదని చెప్పారు. మరి ఇప్పుడు నాగార్జున తండ్రి బాటలో నడుస్తాడో, తనదైన మార్గాన్ని ఎంచుకుంటాడో చూడాలి.